రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. మరో 24 గంటల్లో లోక్సభ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారో బయటపడనుంది. ఉత్కంఠ రేపుతున్న లెక్కింపు ప్రక్రియ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. లెక్కింపు కేంద్రాల వద్ద శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగిన చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లెక్కింపు కేంద్రాల వద్ద 10 వేల మంది పోలీసులతో పాటు మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు.
లెక్కింపు కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలు
లెక్కింపు కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధిస్తున్నారు. కిలోమీటరు పరిధిలో ఐదుగురికి మించి ఎక్కువ మంది గుమిగూడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లెక్కింపు కేంద్రాల్లోనికి చరవాణీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించట్లేదు. కేవలం రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు మాత్రమే సెల్ ఫోన్ అనుమతిస్తున్నామని తెలిపారు.
'అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దు'
37 ప్రాంతాల్లోని 123 స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలను లెక్కింపు కేంద్రాలకు తీసుకెళ్లే సమయంలో కేంద్ర బలగాలు పహారా కాయనున్నాయి. ప్రతీ లెక్కింపు కేంద్రానికి ఒక్కో పోలీస్ ఉన్నతాధికారిని బాధ్యులుగా నియమించారు. మే 23న ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటలకు వరకు మద్యం, బెల్టు దుకాణాలు, బార్లు బంద్ చేయాలని అధికారులు ఇది వరకే ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బాణాసంచా, మైకులు వినియోగించొద్దని సూచిస్తున్నారు.
నిజామాబాద్ లెక్కింపు కేంద్రాలకు అదనపు బందోబస్తు
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో లెక్కింపు కేంద్రాలకు అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ అధిక సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండటం వల్ల 36 టేబుళ్లతో లెక్కించనున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదనపు బలగాలను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని లెక్కింపు కేంద్రాల్లోనూ అవసరాన్ని బట్టి అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ఇవీ చూడండి : 'ఆయన సినిమాతో సంసారం చేస్తోన్న యోగి'