కుటుంబ బాధ్యతను భుజానికెత్తుకున్న వారొకరు... కష్టాల కోర్చి సంసార నావను నెట్టుకొస్తున్నది ఇంకొకరు... జీవితాంతం కష్టించి.. చరమాంకంలో సుఖ పడే సమయంలో మరొకరు... ఇలా నూనూగు మీసాల ప్రాయం నుంచి, ముదుసలి వయసు వరకూ అందరిదీ ఒక్కో కథ. వీరందరి జీవితాలు ఒకేసారి తెల్లారిపోయాయి. సంతోషంగా నిశ్చితార్థానికి బయలు దేరిన వారికి అదే ఆఖరి ప్రయాణమైంది.
అమ్మ ఎందుకు ఏడుస్తోందో...
నాన్న రూపం మదిలో పదిలం కాకుండానే ఛిద్రమైపోయింది నాగరాజు దేహం. పాప పుట్టి కేవలం నెల మాత్రమే! పుట్టింటి నుంచి భార్య ఇంటికి కూడా రాలేదు. ఇంతలోనే వారి కుటుంబాన్ని చూసి ఆ దేవుడికే కన్ను కుట్టినట్టుంది. సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో విషాదం నింపేశాడు. నెలరోజుల పాపకు ఓ తండ్రిని దూరం చేశాడు. అమ్మ ఎందుకు ఏడుస్తోందో తెలియక... నాన్న ఎందుకు లేవటం లేదో అర్థం కాక... ఆ చిన్నారి విలపిస్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టించింది. ఇలా చెప్పుకుంటూ వెళితే... ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ.
ఒకేసారి పదహారు మృతదేహాలు...
ఒకేసారి పదహారు మృతదేహాలు ఒకేచోట చూసి.... హృదయం చలించిపోయింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలోని మృతదేహాలకు సర్వజన వైద్యశాలలో శవ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం మృత దేహాలను మహాప్రస్థానం వాహనాల్లో తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా రామాపురం గ్రామానికి తరలిస్తున్నారు. నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా ఘటన జరగడం వల్ల రామాపురంతోపాటు గుంతకల్లులోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి: కర్నూలు 'మృతదేహాలకు' శవపరీక్ష