ఏడు ఈశాన్య రాష్ట్రాలతో పోల్చితే హైదరాబాద్ నగరంలో విద్యుత్తు వాడకం ఎక్కువగా ఉందని ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు అన్నారు. వివిధ రాష్ట్రాల్లో వినియోగిస్తున్న విద్యుత్ హైదరాబాద్‌తో పోల్చితే చాలా తక్కువగా ఉందన్నారు. డిమాండ్‌కు తగినట్లు కరెంట్ సరఫరా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నగరం చుట్టూ 400 కేవీ రింగు ఏర్పాటు చేశామని... నాలుగు 400 కేవీ సబ్స్టేషన్లు నిర్మించామన్నారు.
వివిధ రాష్ట్రాల్లో..
హిమాచల్ ప్రదేశ్‌లో 1,387 మెగావాట్లు, జమ్మూకశ్మీర్‌లో 2,826, ఉత్తరాఖండ్‌లో 1,922, గోవాలో 594, సిక్కింలో 100, ఝార్ఖండ్‌లో 1,266, అస్సాంలో 1,712 మెగావాట్ల విద్యుత్తు వినియోగం జరుగుతోంది. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న పారిశ్రామికీకరణ, ఐటీ పరిశ్రమ వృద్ధి, వాణిజ్య కనెక్షన్లు పెరగడం, తదితర అవసరాల కోసం కరెంట్ వినియోగం చాలా వరకు పెరిగింది. తెలంగాణ ఏర్పడినప్పుడు నగరంలో 37.8 లక్షల ఎల్టీ విద్యుత్తు కనెక్షన్లు ఉంటే ఇప్పుడు అవి 47.8 లక్షల ఎల్టీ కనెక్షన్లకు చేరుకుని 27 శాతం వృద్ధి సాధించింది.
ఇవీ చూడండి: ఈవీఎంలపై కాంగ్రెస్-భాజపా మాటల యుద్ధం