KCR - STALIN MEET: తమిళనాడు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యారు. జాతీయ, రాజకీయ పరమైన అంశాలు, పాలనాపరమైన విషయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్లు సమాచారం. నదీజలాల వివాదాలు, ఆహార ధాన్యాల కొనుగోళ్లు, కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వ వైఖరి.. తదితర అంశాలపై కేసీఆర్, స్టాలిన్ చర్చించినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
మర్యాదపూర్వక భేటీనే..
KTR On STALIN: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అద్భుతమైన సమయాన్ని గడిపినట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. సీఎం కేసీఆర్ తనను మర్యాదపూర్వకంగా కలిశారన్నారు. కేటీఆర్ సైతం ఈ భేటీపై స్పందించారు. దక్షిణాది ప్రముఖులతో భేటీలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. సీఎం స్టాలిన్ గొప్ప ఆతిథ్యానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
సోమవారం.. ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగం వెళ్లిన కేసీఆర్.. రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రంగనాథస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆలయంలోని గజరాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. గత రెండేళ్లలో రెండోసారి శ్రీరంగ ఆలయానికి వచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. స్వామివారిని దర్శించుకొని వెళ్తే ఎంతో శక్తి వచ్చిన అనుభూతి కలుగుతుందని తెలిపారు.
కమల్‌తో భేటీ..?
బుధవారం.. ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉంది.
ఇదీచూడండి: TRS Wins MLC Election 2021 : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం