రాష్ట్రంలో రేపటి నుంచి ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో బడుల ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభిస్తారా.. లేదా వాయిదా వేస్తారా అనే అంశంపై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో రేపటి నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శాస్త్రీయ అధ్యయనం లేకుండానే పాఠశాలలు తెరుస్తున్నారని ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం ఇవాళ విచారణ విచారణ చేపట్టింది.
వారిపై చర్యలొద్దు..
ప్రత్యక్ష బోధనకు తప్పనిసరిగా హాజరు కావాలని విద్యార్థులను బలవంత పెట్టవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. అదేవిధంగా ఆన్లైన్ బోధన కొనసాగించాలా.. ఆఫ్‌లైన్ తరగతులే ప్రారంభించాలా అనే నిర్ణయం విద్యా సంస్థలే తీసుకోవాలని పేర్కొంది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపైనా చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
ఆ ఉత్తర్వులపై స్టే..
ప్రత్యక్ష బోధన నిర్వహించే విద్యా సంస్థలు అనుసరించాల్సిన విధివిధానాలను వారంలోగా ఖరారు చేసి.. మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం సహా అధికారులు తనిఖీలు చేయాలని సూచించింది. గురుకుల విద్యాలయాలను ఇప్పుడే తెరవొద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలన్న ఉత్తర్వులను నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాల్లో వసతులపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కొవిడ్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సలహా కమిటీ ఇచ్చిన నివేదికను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రెండు కోణాల్లోనూ ఆలోచించాలి..
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యక్ష తరగతులు, ఆన్లైన్ బోధనపై భిన్నాభిప్రాయాలు. లాభ నష్టాలు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. చాలాకాలంగా విద్యా సంస్థలకు దూరంగా ఉండటం వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయన్న అధ్యయనాలు ఉన్నాయని చెప్పింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి సమస్యల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ తరగతులు అందుకుకోలేకపోతున్నారని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు ప్రస్తుతం కొవిడ్ తీవ్రత కొనసాగుతోందని.. త్వరలో మూడో దశ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు కూడా వస్తున్నాయని న్యాయస్థానం పేర్కొంది. కాబట్టి ప్రభుత్వం రెండు కోణాల్లోనూ పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
స్థానిక పరిస్థితులను బట్టే నిర్ణయం..
రాష్ట్రంలో ఇంకా చాలా మందికి వ్యాక్సినేషన్ కాలేదని.. పిల్లలకు వ్యాక్సిన్లే అందుబాటులోకి రాలేదని ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ పిల్లలకు కరోనా పాజిటివ్ వస్తే.. వారిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. వారి ద్వారా ఇళ్లల్లోని వృద్ధులకు సోకే ప్రమాదం పొంచి ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే 16 నెలలుగా విద్యార్థులు బడులకు దూరంగా ఉన్నారని.. ఇప్పటికీ ప్రారంభించకపోతే.. తీవ్రంగా నష్టం పోతారని.. ఇతర రాష్ట్రాలూ ప్రారంభించాయని.. యునిసెఫ్ వంటి సంస్థలూ సిఫార్సు చేసిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్.. సిఫార్సు చేసినప్పటికీ.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే తుది నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాలను సమర్పించాలని విద్యాశాఖను ఆదేశిస్తూ విచారణ అక్టోబరు 4కి వాయిదా వేసింది.
ఇదీచూడండి: TS High Court: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు