ఏపీలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల, మల్యాల పంపింగ్ స్టేషన్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ఎస్కేప్ చానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించకుండా నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు బోర్డు ఛైర్మన్‌కు నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. సుంకేశుల ఆనకట్ట కేసీ కాల్వకు 39.90 టీఎంసీల కేటాయింపులు ఉండగా ప్రతి ఏటా సగటున 54 టీఎంసీల తుంగభద్ర జలాలను తరలిస్తున్నారని... దీంతో ఆర్డీఎస్కు 15.90 టీఎంసీల కేటాయింపులు ఉండగా... సగటున ఐదు టీఎంసీలకు మించి తరలించడం సాధ్యం కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. తుంగభద్ర జలాలను కేటాయింపులకు మించి తీసుకోవడంతో పాటు కృష్ణా జలాలను ముచ్చుమర్రి ఎత్తిపోతల, మల్యాల పంపింగ్ స్టేషన్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ఎస్కేప్ చానల్ ద్వారా కేసీకాల్వకు తరలిస్తున్నారని తెలిపారు.
తాగునీటి అవసరాలకు ఇబ్బంది కలుగుతోంది
శ్రీశైలం జలాశయం నుంచి కేసీకాల్వకు నీటిని తరలించడం అక్రమమని ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో శ్రీశైలం నుంచి 39 టీఎంసీలను మాత్రమే తరలించాలని... కానీ కేటాయింపులు లేని అక్రమ ఎత్తిపోతల పథకాల ద్వారా పరిమితికి మించి నీటిని తరలిస్తోందని ఆక్షేపించారు. శ్రీశైలం జలాశయం కనీస నీటివినియోగ మట్టానికి దిగువన 798 అడుగుల నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తున్నారని... దీంతో తెలంగాణ ప్రాజెక్టులకు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇబ్బంది కలుగుతోందని అన్నారు. బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ద్వారా, హంద్రీనీవా ఎత్తిపోతలకు సంబంధించిన మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి కూడా కేసీ కాల్వను కృష్ణా జలాలను తరలిస్తున్నారని పేర్కొన్నారు.
జలశక్తి మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లండి
ముచ్చుమర్రి ఎత్తిపోతల, నీటి కేటాయింపులు లేని హంద్రీనీవా ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం నుంచి, నిప్పులవాగు ఎస్కేప్ చానల్ నుంచి నీటి తరలింపును వెంటనే ఆపివేయాలని ఈఎన్సీ కోరారు. ట్రైబ్యునల్ ద్వారా ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరిపే వరకు ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి కేటాయింపులను నిరోధించాలని... అక్రమ నీటి తరలింపును ఆపివేయాలని కేఆర్ఎంబీని తెలంగాణ కోరింది. వీటికి సంబంధించి 1944 జూన్ ఒప్పందం, 1951 అంతర్ రాష్ట్ర సమావేశం, కేసీకాల్వ-ఆర్డీఎస్ నీటి వినియోగం, కేసీ కాల్వకు అక్రమంగా నీటి తరలింపు మార్గాల వివరాలను కూడా లేఖతో పాటు జతపరిచారు. కేంద్ర జలవనరుల విభాగంతో పాటు జలశక్తి మంత్రిత్వశాఖ దృష్టికి ఈ లేఖ, సమాచారాన్ని తీసుకెళ్లాలని కోరారు.
గతంలోనూ లేఖ
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణాజలాలను తరలించకుండా తక్షణమే నిలువరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కోరింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్‌కు అప్పుడే లేఖ రాశారు. అటు ఆంధ్రప్రదేశ్ కూడా కృష్ణా బోర్డుకు లేఖలు రాసింది. ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేస్తూ లేఖలు రాస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ గత నెలలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ అమలు కార్యాచరణ ఖరారు కోసం ఆగస్టు 9న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు హైదరాబాద్ జలసౌధలో ఉమ్మడిగా అత్యవసర సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసుల విచారణ దృష్ట్యా సమావేశానికి హాజరు కావడం కుదరదని ముందే తెలిపిన తెలంగాణ ప్రభుత్వం భేటీకి గైర్హాజరైంది.
ఇదీ చదవండి: KRMB, GRMB Meeting: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ... తెలంగాణ గైర్హాజరు
KRMB, GRMB: గెజిట్ అమలుకు రెండు రాష్ట్రాలు సహకరించాలి: బోర్డులు