TS Letter to Krishna Board: నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూల్ నుంచి మూడో షెడ్యూల్లోకి మార్చాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని నోటిఫికేషన్లో రెండు కాంపోనెంట్లుగా పేర్కొన్నారని... రెండింటిని ఒకటిగానే పరిగణించి మార్పులు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
ఏపీతో ఏ మాత్రం సంబంధం లేదు
నెట్టెంపాడు కాంపోనెంట్‌ను ఒకటి, రెండు షెడ్యూళ్ల నుంచి తొలగించాలని కృష్ణాబోర్డును ఈఎన్సీ కోరారు. జూరాల ప్రాజెక్టుతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని కాంపోనెంట్లు పూర్తిగా తెలంగాణకు చెందినవేనన్న ఈఎన్సీ... ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌తో ఏ మాత్రం సంబంధం లేదని వివరించారు. ఏపీతో సంబంధం లేని జూరాల ప్రాజెక్టు కాంపోనెంట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలో ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ మేరకు జూరాల ప్రాజెక్టు కాంపోనెంట్లను రెండో షెడ్యూల్ నుంచి తొలగించి మూడో షెడ్యూల్లో చేర్చాలని కోరారు.
ప్రాజెక్టులన్నీ పూర్తైనప్పటికీ...
జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని కాల్వల ద్వారా 9,500 క్యూసెక్కులకు మించి నీటిని తరలించే పరిస్థితి లేదని లేఖలో ఈఎన్సీ తెలిపారు. 2008 నుంచి 2021 వరకు జూన్, అక్టోబర్ మధ్య ప్రాజెక్టుకు సగటు ప్రవాహాలు 44వేల క్యూసెక్కులుగా ఉందని వివరించారు. దీంతో దిగువన ఉన్న నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. తెలంగాణ ప్రతిపాదించిన ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలని బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని... ప్రాజెక్టులన్నీ పూర్తైనప్పటికీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పది లక్షలకు సాగునీటి వసతి ఉండబోదని అన్నారు.
తెలంగాణకు న్యాయం చేయాలి
తెలంగాణలోని కృష్ణా బేసిన పరిధిలో ఉన్న నీటి అవసరాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిగణలోకి తీసుకోవాలని... చారిత్రక అన్యాయాలను సవరించి తెలంగాణకు న్యాయం చేయాలని కృష్ణా బోర్టును ఈఎన్సీ కోరారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కాంపోనెంట్‌ను మొదటి, రెండు షెడ్యూళ్ల నుంచి... జూరాల ప్రాజెక్టు కాంపోనెంట్లను రెండో షెడ్యూల్ నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి : త్వరలో కేఆర్ఎంబీ భేటీ.. ఈసారి తెలుగురాష్ట్రాల కోసం కాదు..!