Gyanvapi Mosque Case: ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి జ్ఞాన్వాపీ మసీదులో పూజలకు అనుమతించాలని హిందువులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను.. వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది సుప్రీం కోర్టు. ఉత్తర్‌ప్రదేశ్ న్యాయ విభాగానికి సంబంధించి.. సీనియర్, అనుభవజ్ఞులైన జ్యుడీషియల్ అధికారి ఈ కేసును విచారించాలని ఆదేశించింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ నుంచి కేసును వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేసినట్లు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తెలిపింది.
మసీదులో వీడియోగ్రఫీ సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మసీదులో చిత్రీకరించిన వీడియోలను హిందూ పిటిషనర్లు బయట పెట్టడంపై స్పందించిన కోర్టు.. వాటిని మీడియాకు ఉద్దేశపూర్వకంగా లీక్ చేయడం కచ్చితంగా ఆగాలని స్పష్టం చేసింది. మసీదులో బయటపడిన శివలింగం పరిరక్షణ, ముస్లింల ప్రార్థనలకు అనుమతిస్తూ మే 17న తాము ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. మసీదులో కాళ్లు శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించే వాజు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు ఎనిమిది వారాల గడువు ఇస్తూ.. తదుపరి విచారణను సుప్రీంకోర్టు జులై నెలకు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: జ్ఞాన్వాపి సర్వేలో సంచలన నిజాలు.. మసీదులో హిందూ దేవతల విగ్రహాలు!
జ్ఞాన్వాపి కేసు.. మేము విచారణ జరిపే వరకు మీరు ఆగండి: సుప్రీంకోర్టు