ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఈ మెగా పోటీలకు దూరం అయ్యాడు. ఫిట్‌నెస్ కారణంగా నీరజ్ పోటీల్లో పాల్గొనడం లేదని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) ప్రకటించింది.
యూజీన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సత్తా చాటాడు నీరజ్. అయితే ఆ పోటీల సమయంలో అతడికి గజ్జల్లో గాయమైనట్లు ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా చెప్పారు. అతడికి ఒక నెల విశ్రాంతి అవసరమని నిపుణులు సూచించినట్లు పేర్కొన్నారు.
"ఫిట్‌నెస్ కారణంగా కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొనలేకపోతున్నానని చెప్పేందుకు నీరజ్ చోప్రా ఈ రోజు అమెరికా నుంచి నాకు ఫోన్ చేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న తరువాత.. చోప్రా సోమవారం ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్నాడు. రిపోర్టుల ఆధారంగా డాక్టర్లు ఒక నెల విశ్రాంతి అవసరమని చెప్పారు."
-రాజీవ్ మెహతా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) సెక్రటరీ జనరల్
2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో లాంగ్ జంప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు అంజు బాబీ జార్జ్. దాదాపు 24 ఏళ్ల అనంతరం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన రెండో భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు నీరజ్.
గురువారం నుంచి ప్రారంభమయ్యే కామన్‌వెల్త్ క్రీడల్లో చోప్రా భారత పతాకధారిగా ఉండాల్సింది. అయితే మెగా పోటీలకు అతను దూరం కావడం వల్ల.. కొత్త పతాకధారిని త్వరలో ప్రకటిస్తామని భారత జట్టు చెఫ్ మిషన్ రాజేష్ భండారీ చెప్పారు.
ఇదీ చదవండి: నిండు గర్భిణి అయినా.. 'ఒలింపియాడ్' బరిలోకి హారిక