కూచిపూడి నృత్యానికి నిలువెత్తు నిదర్శనం.. శోభానాయుడు. ఖండాంతరాల్లోనూ కూచిపూడి విశిష్ఠతను చాటిచెప్పి... శాస్త్రీయ నృత్యంలో గొప్ప కళాకారిణిగా ఎదిగారు. శోభానాయుడు పసివయసు నుంచే నాట్యంపై అమితమైన ప్రేమతో.. కూచిపూడిలో పన్నెండేళ్ల వయసులోనే అరంగేట్రం చేసి తనదైన ముద్రవేశారు. 2001లో ఆమెను కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
శోభానాయుడు కూచిపూడి నృత్యంలో... గురువును మించిన శిష్యురాలిగా ఎదిగారు. పన్నెండేళ్ల వయసులోనే రంగస్థలంపై అరంగేట్రం చేసిన ఆమె... ఐదు దశాబ్దాలుగా కూచిపూడి నృత్యమే శ్వాసగా జీవించారు. నాట్యమంటే కేవలం అభినయం కాదు.... జీవం ఉండాలని తరచూ చెప్పే శోభానాయుడు... కూచిపూడిని సరికొత్తగా ప్రదర్శిస్తూ ఔరా అనిపించేవారు. శ్రీకృష్ణ పారిజాతం, జగదానందకారక, కల్యాణ శ్రీనివాసం, శ్రీకృష్ణ శరణం మమ.... విజయోస్తుతే నారీ, క్షీరసాగర మదనం, విప్రనారాయణ, నృత్యరూపకాలతో పాటు, చండాలిక, సర్వం సాయిమయం, నవరస నటభామిని వంటి నృత్యనాటకాలతో ఆకట్టుకున్నారు..! శోభానాయుడు నృత్యరూపకాల్లో సత్యభామ, చండాలిక, దేవదేవకి, పద్మావతి, మోహిని... సాయిబాబా, పార్వతి పాత్రలు ఆమెకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చాయి.
విశాఖ జిల్లా అనకాపల్లిలో కట్టా వెంకటనాయుడు, సరోజినీ దేవి దంపతులకు శోభానాయుడు 1956లో జన్మించారు. రేడియోలో పాటలు వింటూ శోభానాయుడు నాట్యం చేయడం గమనించిన సరోజినీదేవి... తన కుమార్తెను నృత్యకారిణిగా చేయాలని సంకల్పించారు. అయితే ఇంట్లో ఎవరూ సంగీతాన్ని తప్ప నాట్యాన్ని అభిమానించేవారు కారు. అందువల్ల.. ఎలాగైనా తన కుమార్తెకు నాట్యం నేర్పించాలని.... రాజమహేంద్రవరంలోని కూచిపూడి నృత్యకారుడు టీఎల్ రెడ్డి దగ్గర చేర్పించారు. ఆరేళ్ల వయసులోనే.... తొలి ప్రదర్శన ఇచ్చారు. తండ్రికి ఉద్యోగరీత్యా బదిలీలతో కుమార్తె శిక్షణకు ఆటంకం కలగకూడదని... సరోజినీదేవి చెన్నై తీసుకెళ్లి ప్రముఖ నాట్యగురువు వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేర్పారు. అద్దె ఇంట్లో ఉంటూ... కుమార్తెకు కూచిపూడి నేర్పించారు. అలా పన్నెండేళ్ల వయసులో... కూచిపూడి నృత్యంలో అరంగేట్రం చేసిన శోభానాయుడు దేశం గర్వించేలా ఎదిగారు.
సత్యభామ, పద్మావతి, చండాలిక, కృష్ణుడి పాత్రల్లో.... ఒదిగిపోయే శోభానాయుడు.., కూచిపూడి నృత్యంతో.... ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసేవారు. సత్యభామ పాత్ర వేయాలంటే శోభానాయుడుకు ఎంతో ఇష్టం..! అలా..., కూచిపూడి కళాకారిణిగా రాణిస్తున్న శోభానాయుడును కేంద్రం కూచిపూడి ప్రచారకర్తగా నియమించింది. కూచిపూడికి సమకాలీన అంశాలు జోడించి.... ప్రదర్శనలు ఇచ్చేవారు. ఎనభైకి పైగా నృత్య ప్రదర్శనలు... 16 నృత్య నాటకాలు ప్రదర్శించిన శోభానాయుడు.... యూకే, సిరియా, టర్కీ, హాంకాంగ్, మెక్సికో, వెనిజులా, క్యూబా వంటి దేశాల్లో కూచిపూడి నాట్య విశిష్టత చాటారు.
కూచిపూడి నృత్యంలో సేవలకు గానూ... 1982లో శోభానాయుడు కృష్ణగానసభ నుంచి తొలి 'నిత్య చూడామణి' పురస్కారం అందుకున్నారు. సంగీత నాటక అకాడమీ 1990లో.. అకాడమీ పురస్కారంతో శోభానాయుడును సత్కరించింది. 1998లో ఎన్టీఆర్ పురస్కారం అందజేశారు. 2001లో శోభానాయుడుకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.. గౌరవ డాక్టరేట్‌తో సన్మానించింది. ఇలా ఎన్నో పురస్కారాలు, మరెన్నో బిరుదులు అందుకున్న శోభానాయుడు... హైదరాబాద్ దోమలగూడలోని కూచిపూడి ఆర్ట్ అకాడమీకి ప్రిన్సిపల్‌గా పనిచేశారు. సుమారు 40 ఏళ్లపాటు ఎంతోమంది విద్యార్థులను నాట్యకళాకారులుగా తీర్చిదిద్దారు. శోభానాయుడు శిష్యుల్లో అనేకమంది రాష్ట్ర, జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అంతేకాదు, దేశ విదేశాల్లోనూ స్థిరపడిన ఆమె శిష్యులు., కూచిపూడి నృత్యాన్ని భావితరాలకు నేర్పుతున్నారు.
శాస్త్రీయ నృత్యకళల్లో శోభానాయుడి ప్రదర్శనలు చూసిన కొందరు సినీ దర్శకులు, ఆమెను సినీరంగంలోకి ఆహ్వానించారు. బాపు, బాలచందర్, కే.విశ్వనాథ్ లాంటి దర్శకులు మంచి పాత్రలు రాశారు. బీఎన్ రెడ్డి లాంటి అగ్ర దర్శకులు, ఖాళీ చెక్కులిచ్చి సినిమాల్లో అవకాశమిచ్చారు. సున్నితంగా తిరస్కరించిన శోభానాయుడు కూచిపూడితోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటానని చెప్పేవారు. ఆ మాటతో శోభానాయుడి సంకల్పానికి దర్శకులు సలాం కొట్టేవారు.
ఐదు దశాబ్దాలుగా కూచిపూడి నృత్యానికి పట్టం కట్టిన శోభానాయుడు... తన వారసురాలిని కూడా ప్రోత్సహించారు. ఆమె కుమార్తె సాయిశివరంజిని తల్లితో కలిసి ఎన్నో వేదికల్లో ప్రదర్శనలిచ్చి ఔరా అనిపించారు. శోభానాయుడు అసలు పేరు శోభాదేవి. ఓ పాత్రికేయుడు రాసిన ఇంటర్వ్యూలో తండ్రిపేరును జోడిస్తూ శోభానాయుడు అని రాయడం వల్ల, అప్పటి నుంచి అదే అసలు పేరుగా మారిపోయింది.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో కుంభవృష్టి.. జలదిగ్బంధంలో కాలనీలు..