EX MLA Bodige Shobha Arrest: భాజపా జాగరణ దీక్ష కేసులో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను పోలీసులు అరెస్టు చేశారు. దీక్షకు సంబంధించి ఈ నెల 3న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా.. 16మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే బండి సంజయ్ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండగా... ఇప్పుడు బొడిగె శోభను అరెస్టు చేశారు.
317 ఉద్యోగ ఉపాధ్యాయ జీవోను సవరించాలని కోరుతూ ఈ నెల 3న కరీంనగర్లో ఎంపీ కార్యాలయం ముందు బండి సంజయ్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణ వివిధ సెక్షన్లపై కేసులు నమోదు చేయగా.. బండి సంజయ్‌తో పాటు పది మందిపై కేసులు బనాయించారు. ఇందులో భాగంగా బొడిగె శోభ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో ఆమె బయటకు రాకుండా తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉన్నారు. అరెస్టుకు సహకరించాలని పోలీసులు కోరడంతో.. మొత్తానికి శోభ తలుపులు తీశారు. అనంతరం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
317 జీవో కారణంగా.. ఎంతోమంది ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. వారి ఆవేదన చూడలేక జీవో సవరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాం. ధర్నా, నిరసనలు కాకుండా ఎంపీ కార్యాలయం వద్దనే దీక్ష చేపట్టాం. కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ సీపీ మా దీక్షను అడ్డుకున్నారు. భాజపా కార్యకర్తలపై దాడులు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ను, కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా మేము అడ్డుకున్నాం. కానీ ఇప్పుడు మాపై 333 సెక్షన్ పెట్టి అరెస్టులు చేయడం అన్యాయం. ---- బొడిగె శోభ, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, భాజపా నాయకురాలు
తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అరెస్టు చేయకుండా అడ్డుకున్న తనను.. ఇప్పుడు పోలీసులు అరెస్టు చేయడం సిగ్గుచేటని శోభ అన్నారు. పోలీసులు భాజపా కార్యకర్తలు, నాయకులపై దాడి చేశారని.. కానీ పోలీసులే అక్రమ అరెస్టులకు పాల్పడ్డారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు తగిన బుద్ధి చెబుతారని శోభ హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఆర్ఆర్ఆర్ సినిమాపై హైకోర్టులో పిల్