వచ్చే పదేళ్లలో భారత్‌లో 3 ఐసీసీ టోర్నమెంట్లు జరగనున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి.. రాబోయే దశాబ్ద కాలానికి సంబంధించిన 8 కొత్త టోర్నీల వివరాలను మంగళవారం (ICC News) ప్రకటించింది. 2026 టీ20 ప్రపంచకప్ (శ్రీలంకతో సంయుక్తంగా), 2031 వన్డే ప్రపంచకప్ (బంగ్లాదేశ్‌తో సంయుక్తంగా), 2029 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది.
ఎట్టకేలకు పాక్‌లో..
ఇక దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్‌లో (Pakistan Cricket News) అతిపెద్ద క్రికెట్ ఈవెంట్ జరగనుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి (2025 Champions Trophy).. పాక్ ఆతిథ్యమివ్వనుంది. పాకిస్థాన్ చివరిసారిగా భారత్, శ్రీలంకతో సంయుక్తంగా 1996 ప్రపంచకప్‌ను నిర్వహించింది. 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టు ఉన్న బస్సుపై దాడి జరిగిన నాటి నుంచి ఆ దేశంలో పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగలేదు.
పాక్‌లో సాధ్యమేనా?
చివరి ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) యూకేలో 2017లో జరిగింది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఐసీసీ దానిని నిర్వహించనుంది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు ఇటీవలే పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్నాయి. మరి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎన్ని దేశాలు.. పాక్ గడ్డపై అడుగుపెట్టేందుకు సుముఖంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ టోర్నీని పాక్.. యూఏఈలో నిర్వహించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
14 దేశాల్లో..
2023 నుంచి 2031 వరకు.. (ICC Events List) రెండు వన్డే ప్రపంచకప్‌లు, నాలుగు టీ20 ప్రపంచకప్‌లు, రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు జరగనున్నాయి. వీటికి 14 ఐసీసీ సభ్యదేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. 2024 టీ20 ప్రపంచకప్ అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఉత్తర అమెరికాలో జరగబోయే తొలి గ్లోబల్ ఈవెంట్ ఇదే.
పూర్తి షెడ్యూల్ ఇదే..
టోర్నమెంట్ | ఆతిథ్య దేశం |
2024 టీ20 ప్రపంచకప్ | అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా |
2025 ఛాంపియన్స్ ట్రోఫీ | పాకిస్థాన్ |
2026 టీ20 ప్రపంచకప్ | భారత్, శ్రీలంక సంయుక్తంగా |
2027 వన్డే ప్రపంచకప్ | దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా |
2028 టీ20 ప్రపంచకప్ | ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా |
2029 ఛాంపియన్స్ ట్రోఫీ | భారత్ |
2030 టీ20 ప్రపంచకప్ | ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ సంయుక్తంగా |
2031 వన్డే ప్రపంచకప్ | భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా |
ఇదీ చూడండి: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వేదికలు ఖరారు