YSRTP Supports Congress in Telangana Election : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. శాసనసభ ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తామని మొదట ప్రకటించిన వైఎస్‌ఆర్‌టీపీ ఇప్పుడు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఈ మేరకు ప్రకటించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Sharmila: 'నేను వైఎస్‌ఆర్ బిడ్డను.. బోనులో పెట్టినా పులి పులే'
YSRTP Clarity on Telangana Elections Contest : ప్రజల సంక్షేమం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అవినీతి, అక్రమాలు బయటపెట్టిందే తమ పార్టీ అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని.. కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందని జోస్యం చెప్పారు. అందుకే హస్తం పార్టీని దెబ్బతీయాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ అతిపెద్ద లౌకిక పార్టీ అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
YS Sharmila Comments on BRS Government : తెలంగాణ సర్కారు మారే అవకాశం వచ్చినప్పుడు అడ్డుపడటం సబబు కాదని వైఎస్ షర్మిల చెప్పారు. కేసీఆర్ (KCR) అవినీతి పాలన అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ మరోసారి సీఎం కాకూడదని అన్నారు. తాము పోటీ చేయకపోవడం చాలా బాధాకరమైనా నిర్ణయమైనా తప్పలేదని.. ఇది తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న త్యాగమని వివరించారు. ఈ విషయంలో తాను తప్పు చేసినట్లు అనిపిస్తే క్షమించాలని కోరారు. రాజకీయాలు అంటే చిత్తశుద్ధి, ఓపిక ఉండకపోతే రాణించలేమని.. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని వైఎస్ షర్మిల వెల్లడించారు.
కలిసి నడుద్దాం.. నిలిచి పోరాడదామంటూ షర్మిల లేఖ.. విపక్షాలు ఓకే చెప్పేనా..?
ఈ క్రమంలోనే మేడిగడ్డ కుంగిపోయిందని.. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక జోక్ అని వైఎస్ షర్మిల ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ఇప్పుడు కేటీఆర్ అంటున్నారని.. అంటే ఆయన తప్పు ఒప్పుకున్నట్లే కదా అని అన్నారు. పాలేరు నుంచి తాను పోటీ చేయాలనుకున్నానని తెలిపారు. తాను పాదయాత్ర చేసిన ఖమ్మం జిల్లాలో తన పక్కన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నడిచారని గుర్తు చేశారు. ఇప్పుడు పొంగులేటి పోటీ చేస్తుంటే తాను పోటీ చేయమంటారా అని ప్రశ్నించారు. ఎప్పటికైనా పాలేరు ప్రజలతో ఓటు వేయించుకుంటానని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 35 ఏళ్లు సేవలందించారని.. ఆయనపై ఉన్న అభిమానాన్ని తనపై కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చూపుతున్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
"శాసనసభ ఎన్నికల్లో మేం పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ప్రభుత్వం మారే అవకాశం వచ్చినప్పుడు అడ్డుపడటం సరికాదు. కేసీఆర్ మళ్లీ సీఎం కాకూడదు. అందుకే కాంగ్రెస్‌కు మద్దతు. కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తున్నాం. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామంటున్నారు.. తప్పు ఒప్పుకున్నట్లే కదా?." - వైఎస్ షర్మిల, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు
YS Sharmila Hunger Strike at Lotus Pond : 'ప్రజలను కలవడానికి మీ పర్మిషన్ తీసుకోవాలా..?'