YSRCP Disqualification Complaint : గతేడాది ఏపీలో జరిగిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీను విభేదించిన ఆనం రాంనారాయణరెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే ఈ నలుగురికీ ఓటు హక్కు లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలాఖరున రాజ్యసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఫిబ్రవరి మొదటివారంలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోగానే ఈ నలుగురి వేటుపై నిర్ణయం తీసుకోనున్నారు.
2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపు గెలిచి తర్వాత వైఎస్సార్సీపీ పంచన చేరిన వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిధర్, కరణం బలరాం , జనసేన తరపు నెగ్గిన రాపాక వరప్రసాద్ కూడా వైఎస్సార్సీపీలో చేరారు. ఆయా నియోజకవర్గాల్లో వారు ఇప్పుడు వైఎస్సార్సీపీ అధికారిక సమన్వయకర్తలుగా కొనసాగుతున్నారు . వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం జగన్ మార్క్ పాలనకే చెల్లింది.
'రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరాం'
పార్టీని విభేదించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయం ఉన్నట్టు ఉండి వైఎస్సార్సీపీ అధినాయకత్వానికి గుర్తొచ్చింది. ఎప్పుడో గతేడాది మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలూ వైఎస్సార్సీపీను విభేదించారు. ఇప్పుడు తీరిగ్గా 10 నెలల తర్వాత వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. అది రెండు మూడు నెలల్లో సాధారణ ఎన్నికలు జరగబోతున్న సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతోపాటు, వారు వేరే పార్టీలో చేరారని వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. తమ టికెట్లను ఎడాపెడా చించేస్తున్న వైఎస్సార్సీపీ అధిష్ఠానంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
ఇలాంటి సమయంలో రాజ్యసభ ఎన్నికల్లో వారంతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓటేస్తారా లేదా అనేది అనుమానమే పీకల ద్వాకా కోపంగా ఉన్న ఎమ్మెల్యేలు పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అర్థం కాని గందరగోళంలో ఉన్న వైఎస్సార్సీపీ అధినాయకత్వం ఈ గండం నుంచి గట్టెక్కేందుకే అలాంటి ఎమ్మెల్యేలందరినీ బెదిరించేందుకే ఇప్పుడు ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలను బ్లాక్‌మెయిల్ చేసేందుకు వైఎస్సార్సీపీ అధిష్ఠానం సిద్ధమైందన్న వాదన వినిపిస్తోంది.
'రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడితే అనర్హత వేటు వేస్తారా?'
ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావాలంటే ముందుగా వారి పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామాలు చేసి వస్తేనే పార్టీలోకి తీసుకుంటాం అని నీతి బోధనలు చేసిన జగన్ తన వద్దకు వచ్చిన బయట పార్టీలకు చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలను మాత్రం దర్జాగా తన పక్కనే కూర్చోబెట్టుకొని ఇంతకాలం రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆయన నిర్వహిస్తున్న సమీక్షలు, సమావేశాలకూ ఈ అయిదుగురు ఎమ్మెల్యేలూ బ్రహ్మాండంగా హాజరవుతున్నారు. ఇప్పటి వరకు కూడా వారు వేరే పార్టీల నుంచి వచ్చారని జగన్ గుర్తు రావడం లేదా మరి. నలుగురు ఎమ్మెల్యేలతోపాటు పార్టీని వదిలేసి వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్సీలపైన కూడా అనర్హత వేటు కోసం వైఎస్సార్సీపీ సోమవారం ఫిర్యాదు చేసింది.