సాధారణంగా ఏదైనా ముఖ్యమైన సమస్య ఉంటేనే ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తుంటారు. మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు కూడా శాసనసభ్యుడికి తన సమస్య గురించి చెప్పుకుంటూ లేఖ రాశాడు. అయితే ఆ లేఖ చదివి ఎమ్మెల్యేనే ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ లేఖలో ఏముంది ?
మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లాకు చెందిన భూషణ్ పేరిట స్థానిక ఎమ్మెల్యే సుభాష్ ధోతేకు ఈ లేఖ అందింది. తనకు గర్ల్‌ఫ్రెండ్ దొరకట్లేదని.. ఆ విషయం తలచుకుంటేనే బాధగా ఉంటోందని వాపోయాడు భూషణ్. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. యువకుడు తనను కలిస్తే అతని సమస్యకు ఏదైనా పరిష్కారం చూపించగలనని పేర్కొన్నారు.
'తాలుకాలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ నాకు గర్ల్‌ఫ్రెండ్‌గా దొరకట్లేదు. ఏ అమ్మాయి నాతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. గద్‌చందూర్ నుంచి రాజౌరా మధ్య రోజూ ప్రయాణిస్తుంటాను. భవిష్యత్తులో నాకు గర్ల్‌ఫ్రెండ్ దొరుకుతుందన్న నమ్మకం కూడా పోతోంది. తాగబోతులకు తప్ప నాలా ఎలాంటి చెడు అలవాట్లు లేని వాళ్లకు గర్ల్‌ఫ్రెండ్స్ దొరకట్లేదు. దయచేసి మీ నియోజకవర్గంలో ఉన్న యువతులను ప్రోత్సహించండి.'
-భూషణ్ జాంబవంత్ రాఠోడ్, లేఖ రాసిన యువకుడు
అయితే.. ఈ లేఖను ఆ యువకుడు నేరుగా ఎమ్మెల్యేకు పంపలేదు. ఓ కార్యకర్త ద్వారా ఈ లేఖ ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. యువకుడి గురించి ఆరా తీయగా ఆ పేరుతో ఎలాంటి వివరాలు లభించలేదు. దీంతో ఈ లేఖపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కేవలం అందరి దృష్టిని ఆకర్షించేందుకు గుర్తుతెలియని వ్యక్తి ఇలా చేసినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి : క్లాస్-12లో టాపర్.. 'నీట్ ఫెయిల్' భయంతో ఆత్మహత్య