రాహుల్ గాంధీని మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాలని ఆ పార్టీ యువజన విభాగం 'ఇండియన్ యూత్ కాంగ్రెస్'(ఐవైసీ) తీర్మానించింది. తద్వారా దేశవ్యాప్తంగా పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపినట్లు అవుతుందని పేర్కొంది. రాహుల్ నాయకత్వం, మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని తెలిపింది. ఇది తీర్మానం మాత్రమే కాదని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అభిప్రాయమని చెప్పుకొచ్చింది. ఈ తీర్మానాన్ని ఐవైసీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఆమోదించారు. ఇప్పటికే దిల్లీ, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ విభాగాలు ఇదే తరహా తీర్మానాలను ఆమోదించాయి.
![Youth Congress passes resolution to appoint Rahul Gandhi as party chief](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10927876_dsfjkds.png)
సోమవారం జరిగిన యూత్ కాంగ్రెస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ ముందే ఈ ప్రస్తావన తీసుకొచ్చారు సభ్యులు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా తిరిగి పగ్గాలు చేపట్టాలని రాహుల్‌ను యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ కోరారు.
అయితే, ఈ విషయంపై ఓపికతో ఉండాలని యూత్ కాంగ్రెస్ సభ్యులకు విన్నవించారు రాహుల్. సహనంతో పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: 'సింధియా.. భాజపాలో ఎప్పటికీ సీఎం కాలేరు'