Young Woman Acid Attack in Guntur : ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నల్లపాడుకు చెందిన యువకుడిపై యువతి యాసిడ్‌తో దాడి చేసింది. వెంకటేశ్ అనే యువకుడిపై తెలంగాణలోని ఖమ్మంకు చెందిన రాధ యాసిడ్ పోసింది. గాయపడిన వెంకటేశ్‌కు గుంటూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. యాసిడ్ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన ఓర్చు వెంకటేశ్ అనే యువకుడు ఓ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. ఆటోలో ఇంటింటికి తిరిగి మంచినీటి డబ్బాలు వేసే క్రమంలో.. గుంటూరు రామిరెడ్డితోటలో ఉంటున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాధ అనే వివాహితతో అతడికి పరిచయం ఏర్పడింది. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఆమెకు భర్త లేకపోవడంతో.. వెంకటేష్,రాధ ఇద్దరూ సహజీవనం చేశారు. ఇటీవల యువకుడి కుటుంబసభ్యులు రాధను ఇంటి నుంచి పంపించేయడంతో.. అతడితో పాటు కుటుంబ సభ్యుల మీద రాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంకటేష్‌తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. కాగా.. తనను బయటకు గెంటేశారనే కక్షతో రాధ మరో ముగ్గురు యువకులతో కలిసి ఆటోలో వెళ్లి వెంకటేష్‌పై యాసిడ్ పోసింది. స్థానికులు బాధితుడిని జీజీహెచ్‌కు తరలించారు. రాధ వచ్చిన ఆటోలోనే పరారైంది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తనకు రాధ ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించిందని బాధితుడు ఆరోపించాడు. మహిళతో పాటు ఆమెకు సహకరించిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.