గుజరాత్లో దారుణం జరిగింది. ఓ యువకుడి కాళ్లను తాడుతో కట్టి లారీ వెనక ఈడ్చుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. అర కిలోమీటర్ పొడవైన తాడుతో కట్టి.. దాదాపు కిలోమీటర్‌పైగా లాక్కెళ్లారు. దీంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళుతున్న ఓ కారు డ్రైవర్ బాధితుడిని కాపాడాడు. సూరత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
హజీరా ప్రాంతంలోని ఓ ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. దారుణాన్ని గమనించిన కారు డ్రైవర్ వెంటనే స్పందించాడు. లారీని వెంబడించాడు. చాకచక్యంగా వ్యవహరించి కారు టైరును తాడుపై ఉంచి కోసేశాడు. యువకుడి ప్రాణాలు కాపాడాడు. అనంతరం అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు అసుపత్రికి బాధితుడిని తరలించాడు. ప్రస్తుతం అతడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. అయితే తాడు కట్టి ఈడ్చుకెళ్లింది ఎవరో తెలియాల్సి ఉందన్నారు. బాధితుడి తలకు, చేతులు, కాళ్లకు తీవ్రగాయాలైనట్లు వెల్లడించారు.
20నెలల చిన్నారిపై అత్యాచారం
20నెలల చిన్నారిపై అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. బాలిక తల్లిదండ్రులు బయటకెళ్లిన సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలో జరిగిందీ ఘటన. రెండు రోజుల క్రితం ఈ ఘోరం జరగ్గా.. ఆదివారం ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలిక ఇంటి పక్కన నివాసం ఉండే 35 ఏళ్ల వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బయటకు వెళ్లి ఇంటికొచ్చిన బాలిక తల్లిదండ్రులు.. ఆమె నొప్పితో బాధపడటం, ఏడవటం గమనించారు. విషయం ఆరా తీయగా బాలిక జరిగిందంతా చెప్పింది. అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.