Marriage With Transgender : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమలో పడ్డాడు ఓ యువకుడు. అనంతరం కుటుంబ సభ్యులను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి ఇష్టంలేని యువకుడి కుటుంబ సభ్యులు.. ఇంటికొచ్చిన దంపతులపై దాడి చేశారు. అక్కడి నుంచి వారిని వెళ్లగొట్టి.. చంపేస్తామని బెదిరించారు. ట్రాన్స్‌జెండర్ నుంచి రూ.60 లక్షల కట్నం డిమాండ్ చేశారు. దీంతో బాధితులిద్దరు పోలీసులను ఆశ్రయించారు. బిహార్‌లో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజధాని పట్నాలోని దానాపుర్ ప్రాంతానికి చెందిన రవికి రెండు సంవత్సరాల క్రితం.. దర్భంగకు చెందిన అధికా చౌదరి అనే ఓ ట్రాన్స్‌జెండర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు అప్పుడప్పుడు హోటళ్లలోనూ కలుసుకునేవారు. చివరగా వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని రవి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీనికి వారు ఒప్పుకోలేదు. అనంతరం జున్ 25న.. స్థానికంగా ఉన్న ఓ గుడిలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం భార్యతో కలిసి ఇంటికెళ్లిన రవిపై అతడి కుటుంబ సభ్యులు దాడి చేశారు. అధికా చౌదరిపైనా దాడికి తెగబడ్డారు. ఇద్దరినీ ఇంట్లో నుంచి గెంటేశారు. రూ.60 లక్షలు కట్నం తెస్తేనే ఇంట్లోకి అడుగుపెట్టాలని అధికను బెదిరించారు. లేదంటే చెంపేస్తామని హెచ్చరించారు.
"అధికను పెళ్లి చేసుకోవడం నా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. నా నిర్ణయాన్ని వారు ఒప్పకోలేదు. అధికను ఇంట్లోకి కూడా తీసుకువచ్చేందుకు వారు ఒప్పుకోలేదు. అన్న ధంజయ్ సింగ్ నన్ను కొట్టాడు. అయినా నేను వెనక్కి తగ్గలేదు. అధికను పెళ్లి చేసుకున్నా. ఈ సమాజంలో విలువలు పడిపోయాయి. ఏం చేసినా తప్పు అంటారు. ఏం చేయకపోయినా తప్పు అంటారు. అవన్నీ నేను పట్టించుకోను. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను" రవి తెలిపాడు.
జులై 12న బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు.. తనను చంపేందుకు ప్రయత్నించారని రవి ఆరోపించాడు. వారి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడని వెల్లడించాడు. అధిక పట్ల తన కుటుంబ సభ్యులు అసభ్యంగా ప్రవర్తించారని రవి వివరించాడు. దీనిపై పోలీసులను ఆశ్రయించారు ఆ దంపతులు. తండ్రి సత్యేంద్ర సింగ్, తల్లితో పాటు అన్న ధంజయ్ సింగ్‌పై వారికి ఫిర్యాదు చేశారు. తమను చంపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. తన భార్య అధికా చౌదరిని కిడ్నాప్ చేసి.. చంపేందుకు కుట్ర చేస్తున్నారని రవి వాపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన దానాపుర్ పోలీసులు.. విచారణ జరుగుతోందన్నారు.