140 అడుగుల ఎత్తు నుంచి పడి.. ప్రాణాలతో బయటపడ్డాడు ఓ యువకుడు. కర్ణాటకలో జరిగిందీ ఘటన. బెళగావి జిల్లాలో గోకక్ తాలూకాలోని ఘటప్రభా నదిపై ఉన్న గోకక్ జలపాతం వద్ద ఓ యువకుడు తన ఫోన్‌లో సెల్ఫీ(Selfie Craze) తీసుకుంటుండగా.. ప్రమాదవశాత్తూ పడిపోయాడు. బాధితుడిని ప్రదీప్ సాగర్‌గా గుర్తించారు అధికారులు.
ఇదీ జరిగింది
ప్రదీప్ సాగర్.. బెళగావిలో ఓ ప్రవేటు బ్యాంకులో పని చేస్తున్నాడు. శనివారం స్నేహితులతో సరదాగా జలపాతం సందర్శనకు వెళ్లిన ప్రదీప్.. ఓ రాయిపై నిలబడి సెల్ఫీ(Selfie Craze) తీసుకోబోయాడు. ఈ క్రమంలోనే కింద పడిపోయాడు. వెంటనే అతని స్నేహితులు గోకక్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాత్రి వరకు ప్రదీప్ జాడ తెలియలేదు. దీంతో అతడు చనిపోయి ఉంటాడని భావించారు.
అయితే ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రదీప్ తన స్నేహితులకు ఫోన్ చేసి.. తాను ఉన్న లొకేషన్ షేర్ చేశాడు. దీంతో గోకక్ సామాజిక కార్యకర్త ఆయుబ్ ఖాన్‌కు ఈ సమాచారం అందించారు. గోకక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఆయూబ్ ఖాన్.. ప్రదీప్ ఉన్న ప్రదేశానికి చేరుకుని రక్షించారు. గాయపడిన ప్రదీప్‌ను గోకక్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: కారులో మంటలు- మాజీ సీఎం కుమారుడు సజీవ దహనం