కోతి కారణంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన దిల్లీలో జరిగింది. నబీకరీమ్ ప్రాంతంలో వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా.. అతని తలపై ఇటుక పడి ప్రాణాలు కోల్పోయాడు.
అసలేమైందంటే..?
నబీకరీమ్ ప్రాంతంలో ఖిలా కదమ్‌కు చెందిన మహ్మద్ కుర్బన్(30).. ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ కోతి.. నీళ్లు తాగడానికి రెండంతస్తుల భవనంపై ఉన్న నీళ్ల ట్యాంక్ మూతను తీసింది. ఈ క్రమంలోనే ఆ మూతపై ఉన్న ఇటుకను విసిరివేసింది. ఈ ఇటుక వీధిలో వెళ్తున్న కుర్బన్ తలపై పడగా.. అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు.. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. స్కూల్ బ్యాగులు తయారు చేసుకుని కుటుంబాన్ని పోషించే మహ్మద్ చనిపోవడం వల్ల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం మరో ఆస్పత్రికి తరలించారు. ఖిలాకదమ్ ప్రాంతంలో ఓంప్రకాష్ అనే వ్యక్తి ఇంటిపై ఉన్న నీళ్ల ట్యాంకుపై నుంచే ఇటుక పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ట్యాంక్‌పై మూత ఎగిరిపోకుండా ఉండేందుకు ఇటుక పెట్టాడని.. నీళ్లు తాగడానికి వచ్చిన కోతి దాన్ని విసిరేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో కోతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: తరగతిగదిలోనే విద్యార్థినిపై హెడ్మాస్టర్ లైంగిక వేధింపులు!