Yogi Adityanath History: ప్రశంసలకు పరవశులైపోరు.. కఠిన నిర్ణయాలకు వెనుకాడరు.. కష్టనష్టాలకు బెదరరు.. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత శషబిషలకు చోటివ్వరు.. ఈ విశిష్ట లక్షణాలే ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో ఆయనకు ఓ ప్రత్యేక స్థానాన్ని, మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించే అవకాశాన్ని కల్పించాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన యోగి ఆదిత్యనాథ్... విద్యార్థి దశ నుంచే చురుకుదనాన్ని, కరకుదనాన్ని ప్రదర్శించారు. తాను విశ్వసించిన వాటి కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలోనే రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గత 37 ఏళ్లలో ఓ పార్టీ వరుసగా రెండోసారి విజయం సాధించడం ఇదే ప్రథమం. ఎన్నో ప్రతికూలతలను అధిగమిస్తూ అధికార భారతీయ జనతా పార్టీ మరోసారి విజయం సాధించేలా చేసిన ఆదిత్యనాథ్ జీవితం ఆద్యంతం ఆసక్తికరం.
అసలుపేరు అజయ్ మోహన్: యోగి ఆదిత్యనాథ్‌గా దేశ ప్రజలందరికీ సుపరిచుతులైన ఆయన అసలు పేరు అజయ్ మోహన్ సింగ్ బిష్త్. 1972 జూన్ 5వ తేదీన అవిభాజ్య ఉత్తర్‌ప్రదేశ్‌లోని పౌడి గఢ్వాల్(ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉంది)లో అటవీ అధికారి ఆనంద్ సింగ్ బిష్త్, సావిత్రి దేవి దంపతులకు జన్మించారు. విద్యార్థి దశలో కొన్నాళ్లు భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ)తో ఉన్నప్పటికీ ఆ రాజకీయాలతో పొసగని అజయ్ హిందుత్వ సిద్థాంతానికి ఆకర్షితులయ్యారు. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఏబీవీపీలో చేరారు. 1990లో 18ఏళ్ల వయసులో అయోధ్య ఆలయ ఉద్యమంలో పాల్గొనేందుకు ఇంటి నుంచి వచ్చేశారు. 1992లో బీఎస్సీ(గణితం) డిగ్రీలో ఉత్తీర్ణులయ్యారు. 1994లో గోరఖ్‌నాథ్ ఆలయ ప్రధాన పూజారి మహంత్ అవైద్యనాథ్ శిష్యుడిగా దీక్ష స్వీకరించారు. అప్పటి వరకూ అజయ్ మోహన్ సింగ్ బిష్త్‌గా ఉన్న ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్‌గా మారింది.
ఆలయంతో విడదీయలేని అనుబంధం: గోరఖ్‌నాథ్ ఆలయమే యోగి ఆదిత్యనాథ్ ఆధ్యాత్మిక, రాజకీయ జీవితానికి పునాదులు వేసింది. గోరఖ్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొంది 1998లో పార్లమెంటులో అడుగు పెట్టారు. 26 ఏళ్ల వయసులో ఎంపీ అయిన చిన్నవయస్కుడిగా నిలిచారు. ఆ స్థానం నుంచే వరుసగా అయిదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. గోరఖ్‌నాథ్‌మఠ ఆలయ ప్రధాన పూజారి, ఆధ్యాత్మిక గురువు మహంత్ అవైద్యనాథ్ మృతి అనంతరం 2014 సెప్టెంబరులో ఆలయ ప్రధాన పూజారిగా యోగి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు. హిందుత్వ భావజాలంతో దూకుడుగా వ్యవహరించే యోగి ఆదిత్యనాథ్ 1999లో హిందూ యువ వాహిని అనే సంస్థను ఏర్పాటు చేశారు. పేరుకు సాంస్కృతిక సంస్థ అయినప్పటికీ అది నిర్వహించిన కార్యక్రమాలపై విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. 2002, 2007 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో భాజపాతో విభేదాలు పొడచూపాయి. గోరఖ్‌పుర్ ప్రాంతంలో తాను సూచించిన అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని ఆదిత్యనాథ్ పట్టుపట్టడమే అందుకు కారణమని చెబుతారు. ఆ తర్వాత ఆరెస్సెస్ జోక్యంతో 2007లో భాజపాతో సంధి కుదిరింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఓటమి పాలైనప్పటికీ గోరఖ్‌పుర్ నుంచి యోగి ఆదిత్యనాథ్ 1,42,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయన స్థాపించిన హిందూ యువ వాహినే ఈ విజయానికి కారణమని విశ్లేషకులు అంటారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్యనాథ్ తమ సీఎం అభ్యర్థి అని ఆ పార్టీ నేరుగా ప్రకటించలేకపోయింది. పార్టీ ప్రచార తారల జాబితాలోనూ చేర్చలేదు. రెండు విడతల పోలింగ్ అయిన తర్వాతే ఆదిత్యనాథ్ పేరును ప్రచార తారల జాబితాలో భాజపా చేర్చింది. ఆ ఎన్నికల్లో భాజపా విజయఢంకా మోగించింది. అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి ఆదిత్యనాథ్‌ను వరించింది.
ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాలు: ముక్కుసూటిగా నిర్ణయాలు తీసుకొనే ఆదిత్యనాథ్ ..విమర్శలకు తలొగ్గబోనని తన చేతల ద్వారా స్పష్టం చేస్తుంటారు. గత ఏడాది సీఎం పదవి నుంచి ఆదిత్యనాథ్‌ను తొలగిస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. అగ్రనేతలు జోక్యం చేసుకొని 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా మళ్లీ అధికారంలోకి రావాలంటే ఆదిత్యనాథ్ నేతృత్వంలోనే 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని స్పష్టం చేయడంతో ఆ ప్రచారానికి తెరపడింది.
"ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భాజపాకు భారీ విజయాన్ని అందించడం ద్వారా.. కుల, మత రాజకీయాలకు ప్రజలు పాతరేశారు. గత రెండు మూడు రోజులుగా ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టి, భాజపా సుపరిపాలనపై విశ్వాసం ఉంచారు. రాష్ట్రంలో వరుసగా రెండోసారి భాజపా అధికారంలోకి రావడానికి సహకరించిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లకు కృతజ్ఞతలు"
- యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం
ఇవీ చూడండి: యూపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. సీఎంగా యోగి పట్టాభిషేకం