The Great Khali joins BJP: 'ది గ్రేట్ ఖలీ'గా పిలుచుకునే భారత ప్రొఫెషనల్ రెజ్లర్ దలీప్ సింగ్ రాణా.. భారతీయ జనతా పార్టీలో చేరారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనను కండువా కప్పి ఆహ్వానించారు భాజపా నేతలు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన భాజపాలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పార్టీలో చేరిన అనంతరం మాట్లాడిన ఖలీ.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే భాజపా విధానమని అన్నారు. భాజపా విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ ఇచ్చే ఏ బాధ్యతనైనా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
ది గ్రేట్ ఖలీ...
డబ్ల్యూడబ్ల్యూఈలో తలపడిన తొలి భారతీయ రెజ్లర్‌గా ఖలీకి గుర్తింపు ఉంది. 2000 సంవత్సరంలో రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టిన ఆయన.. అనంతరం డబ్ల్యూడబ్ల్యూఈలో తలపడి పలు ఛాంపియన్ షిప్ టైటిళ్లను గెలుచుకున్నారు. గతేడాది డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లోనూ చోటు దక్కించుకున్నారు.
రెజ్లింగ్ రంగంలోకి రాక ముందు పంజాబ్ పోలీస్ శాఖలో ఏఎస్ఐగా పనిచేశారు. నాలుగు హాలీవుడ్, రెండు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. పలు టీవీ షోలు చేశారు. 2010-2011లో ఖలీ బిగ్‌బాస్ షోలో పాల్గొని.. ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. ఏడడుగుల ఎత్తుండే ఖలీ కోసం కార్యక్రమ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: 'ఈడీ, సీబీఐ ఒత్తిడి నాపై పని చేయదు.. మోదీ చెప్పిందదే'