Wooden Craft Maker Chhattisgarh Success Story : చెక్కతో అందమైన బొమ్మలను తయారు చేస్తున్నాడు ఛత్తీస్‌గఢ్‌లోని కొర్వా తెగకు చెందిన ఓ వ్యక్తి. చేతితో అతడు చెక్కుతున్న ఈ బొమ్మలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. హస్తకళ నైపుణ్యంతో తాను జీవనోపాధి పొందడమే కాకుండా ఇతరులకు కూడా ఉపాధి కల్పిస్తున్నాడు. అతడే సర్గుజాలోని లాలమాతీ ప్రాంతానికి చెందిన జోలార్ సాయి.
"మొదట్లో మా ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదంటే- ఒకప్పుడు చాలా దూరంలో ఉన్న ఓ అడవి నుంచి కలప తెచ్చి నగరంలో అమ్మేవాళ్లం. అయితే ఒక్కోసారి అటవీశాఖ అధికారుల నుంచి ఇబ్బందులకు తలెత్తేవి. ఎప్పుడైతే ఈ కళను నేర్చుకున్నానో అప్పటి నుంచి ఆ పనిని వదిలిపెట్టాను"
- జోలార్ సాయి, హస్త కళాకారుడు
బొమ్మలే కాదు- కిటికీలు, సోఫాలు కూడా
Wood Craft Maker Inspirational Story : జోలార్ సాయి చేతులతో చెక్కిన బొమ్మలను చూస్తుంటే వాటికి జీవం పోసిన్నట్లుగా ఉంటున్నాయి. ఇంటి కిటికీ మొదలు సోఫాలు, టేబుల్స్ వంటివి కూడా తయారు చేస్తున్నాడు సాయి. తనకు హస్తకళ నేర్చుకోమని ఒకరు సలహా ఇచ్చారని, ఆ తర్వాత తన జీవితం మలుపు తిరిగిందని సాయి చెబుతున్నాడు.
"మేము ఈ బొమ్మలను చేత్తోనే చేస్తాం. చిన్న చిన్న పరికరాలను ఉపయోగించుకుని మాకు వచ్చిన ఆలోచన ప్రకారం చెక్కుతాం. ఈ కళను నేర్చుకున్నాక మాలోని ఆత్మ విశ్వాసం పెరిగి సోఫాలు, తలుపులు లాంటి భారీ వస్తువులను కూడా తయారు చేస్తాం"
-- జోలార్ సాయి, హస్త కళాకారుడు
ఇతరులకు శిక్షణ కూడా!
సాయి తయారు చేస్తున్న వస్తువులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అతడు తన నైపుణ్యంతో బొమ్మలను చెక్కడమే కాకుండా ఇతరులకు కూడా శిక్షణ ఇస్తున్నాడు. తమ లాంటి వారిని ప్రోత్సహించి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.
కళకు ప్రాణం పోస్తున్న కానిస్టేబుల్!
బంగాల్లోని రాయ్‌గంజ్‌కు చెందిన కానిస్టేబుల్ విప్లవ్ కుమార్ దాస్. పనికిరాని చెక్కముక్కలు, రాళ్లతో అద్భుతమైన కళాకృతలను తయారు చేస్తున్నాడు. ఇస్లామ్పుర్కు చెందిన విప్లవ్ కుమార్ ఉద్యోగరీత్యా రాయ్గంజ్లో నివసిస్తుంటారు. ఆయన భార్య ఉపాధ్యాయురాలు. విప్లవ్కు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడమంటే ఆసక్తి. కానీ, తన ఆర్థిక పరిస్థితి కారణంగా ఆ ఇష్టాన్ని మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. అయినప్పటికీ తనలో ఉన్న కళాకారుడు మాత్రం ఊరికే ఉండిపోలేదు. చిత్రాలు వేయలేకపోయినా పనికిరాని వస్తువులతో కళాఖండాలను తీర్చిదిద్దుతున్నారు విప్లవ్. ఆయన తయారు చేసిన కళాకృతులను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.