Women marriage age in India: మహిళల వివాహ వయసును 18 నుంచి 21 పెంచాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లును సమీక్షించనున్న పార్లమెంటరీ ప్యానెల్లో ఒకేఒక్క మహిళా ఎంపీ ఉన్నారు. మహిళా ప్రాధాన్యం ఉన్న ఈ బిల్లుపై సమీక్షించే ప్యానెల్లో 31 మంది సభ్యులు ఉండగా.. వీరిలో 30 మంది పురుషులే కావటంటం గమనార్హం.
woman marriage age Parliament panel
రాజ్యసభ వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం భాజపా సీనియర్ నేత వినయ్ సహస్రబుద్ధె... ఈ పార్లమెంట్ స్థాయీసంఘానికి అధ్యక్షత వహిస్తున్నారు. టీఎంసీకి చెందిన సుష్మితా దేవ్ ప్యానెల్లో ఏకైక మహిళా ఎంపీగా ఉన్నారు.
ప్యానెల్లో మరికొంతమంది మహిళా ఎంపీలు ఉంటే బాగుండేదని సుష్మితా దేవ్ అభిప్రాయపడ్డారు. అయితే, అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొనే బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
Woman members in Parliament panel
ఎన్సీపీ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళల సమస్యలను తరచుగా పార్లమెంట్లో ప్రస్తావించే సూలే.. ప్యానెల్లో మహిళా ఎంపీలు ఉంటే బాగుండేదన్నారు. తద్వారా సంబంధిత ఈ సమస్యపై విస్తృత చర్చ జరిగేదని పేర్కొన్నారు. అవసరమైతే, ప్యానెల్‌కు నిపుణులను ఆహ్వానించే అధికారం ఛైర్మన్‌కు ఉందని, దానికనుగుణంగా పలువురు మహిళా ఎంపీలను పిలవాలని సూచించారు.
Jaya Jaitly committee report
జయా జైట్లీ కమిటీ సిఫార్సుల ఆధారంగా మహిళల వివాహ వయసును పెంచుతూ బిల్లు రూపొందించింది కేంద్రం. ఈ కమిటీ అధ్యక్షులు జయా జైట్లీ సైతం.. స్థాయీ సంఘంలో మహిళా ఎంపీలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం 50 శాతం మంది సభ్యులు మహిళలై ఉండాల్సిందని ఆకాంక్షించారు. 'నిబంధనలు అనుమతిస్తే.. ప్రస్తుతం ఉన్న ఎంపీల స్థానంలో మహిళా ఎంపీలను పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపించేలా రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోవాలి. లేదంటే తమ ఎంపీలు... మహిళా ఎంపీలను సంప్రదించి నిర్ణయాలు తీసుకునేలా ఆదేశించాలి' అని సూచించారు.
Woman marriage age bill
బాల్య వివాహాల నిరోధక (సవరణ) బిల్లును శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందితే మహిళల వివాహ వయసు 18 నుంచి 21కి పెరుగుతుంది. ఈ బిల్లును.. విద్య, మహిళలు, చిన్నారులు, యువజన, క్రీడా అంశాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సిఫార్సు చేసింది.
పార్లమెంట్లో శాఖా సంబంధిత స్థాయీ సంఘాలు శాశ్వతంగా ఉంటాయి. జాయింట్, సెలెక్ట్ కమిటీలను సమయానుగుణంగా ఏర్పాటు చేస్తారు. వివాహ వయసు బిల్లును సమీక్షిస్తున్న ఈ స్థాయీ సంఘం రాజ్యసభ పరిధిలో ఉంటుంది. సభలో సంఖ్యాబలం ఆధారంగా పార్టీలు.. తమ ఎంపీలను ప్యానెల్‌కు నామినేట్ చేస్తాయి.
ఇదీ చదవండి: అమ్మాయి పెళ్లి వయసు పెంచడం మంచిదేనా?