Fake Doctor Couple: నకిలీ వైద్యుల నిర్వాకం.. ఓ మహిళ నిండు ప్రాణాలను తీసింది. సంతానం కోసం వెళ్లిన ఆమె నుంచి రు.లక్షలు దండుకున్నారు వైద్యులుగా చలామణీ అవుతున్న ఆ దంపతులు. వారికి వచ్చిన అశాస్త్రీయ చికిత్స చేసి.. ఆ వివాహిత ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ఈ సంఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా బెలగరహళ్లిలో జరిగింది.
15 ఏళ్ల క్రితం మల్లికార్జున్‌తో మమతకు వివాహమైంది. ఇన్నేళ్లయినా ఆ దంపతులకు పిల్లలు కలగలేదు. సంతానం కోసం అనేక ఆస్పత్రులకు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో మంజునాథ్, వాణి అనే నకిలీ డాక్టర్ దంపతులు మమత, మల్లికార్జున్లను సంప్రదించారు. వారి అవసరాన్ని సొమ్ము చేసుకోవాలని భావించారు. ఐవీఎఫ్ చికిత్స ద్వారా పిల్లలను పొందేందుకు సాయం చేస్తామని వారికి చెప్పారు. ఇందుకోసం నకిలీ డాక్టర్లకు రూ. 4 లక్షలను కూడా చెల్లించారు మమత దంపతులు.
ఈ క్రమంలో కడుపులో బిడ్డ పెరుగుతుందని చెప్పి.. మమత దంపతులను మరికొంత సొమ్మును కూడా అడిగారు నకిలీ డాక్టర్లు. కొద్ది రోజుల తర్వాత మమతకు భరించలేని కడుపునొప్పి వచ్చింది. ఎంతకీ తగ్గకపోడవం వల్ల తన భార్యను వేరే ఆస్పత్రిలో చేర్పించాడు మల్లికార్జున్. అయితే అక్కడ అసలు విషయం బయటపడింది. అసలు మమత గర్భవతి కాదనే విషయం తెలిసింది.
ఆ తర్వాత మమత తీవ్ర అస్వస్థతకు గురైంది. నకిలీ వైద్యుల చికిత్స కారణంగా మమత.. గర్భాశయం, కిడ్నీ, గుండె, మెదడు సంబంధిత వ్యాధులకు గురైనట్లు చికిత్స చేసిన వైద్యులు చెప్పారు. మూడు నెలల పాటు చికిత్స పొందినా.. మమత ఆరోగ్యం మెరుగుపడలేదు. పరిస్థితి విషమించి గత శనివారం (ఈనెల 23వ తేదీ) మృత్యువాత పడింది మమత. కట్టుకున్న భార్యను, డబ్బులను పోగోట్టుకొని.. మల్లికార్జున్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.
మమత, మల్లికార్జున్ లాంటి అనేక మంది అభ్యాగులు ఈ నకిలీ డాక్టర్ల మోసానికి బలైనట్లు సమాచారం. మల్లికార్జున్ ఫిర్యాదు మేరకు నొనవనెకెరె పోలీస్ స్టేషన్‌లో నకిలీ డాక్టర్లు వాణి, మంజునాథ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో చేసిన విచారణలో నకిలీ డాక్టర్లు ఇద్దరూ.. ఎస్‌ఎస్‌ఎల్‌సీ మాత్రమే పాసైనట్లు తేలడం గమనార్హం. ఎలాంటి మెడికల్ డిగ్రీ లేదని స్పష్టమైంది.