కట్టుకున్న వాడు కరోనాతో కాలం చేశాడు. ఇంటి అప్పు ఈఎంఐ, పిల్లల బాధ్యతలు ఆ మహిళను భూతంలా వెంటాడాయి. తమకు అండగా నిలిచే వారు ఈ ప్రపంచంలో లేరని భావించింది. భర్త మరణంతో బతుకు బండిని లాగలేక తాను ఓ జీవచ్ఛవంలా మారానని అనుకొని.. కన్న బిడ్డలతో కలిసి ఆత్మహత్య (Family Suicide News) చేసుకుంది. ఈ విషాద ఘటన కర్ణాటక బెంగళూరు శివారు ప్రాంతంలో జరిగింది.
ఇదీ జరిగింది...
వసంత అనే మహిళ బెంగళూరు శివారు ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లలు (యశ్వంత్, నిష్వకా)తో కలిసి నివాసం ఉండేది. ఆమె భర్త ప్రసన్న కుమార్ బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవర్గా విధులు నిర్వహిస్తుండే వారు. గతేడాది ఆయన కరోనాతో (Corona virus) చనిపోయారు. అప్పటి నుంచి ఇంటి కోసం తీసుకొన్న అప్పును ఎలా తీర్చాలి, తండ్రి లేకుండా పిల్లలను ఎలా పెంచాలి అనే ఆలోచనలు పెరిగాయి. తమకు ఎవరూ అండగా నిలవరనే భావన ఆమెను కుంగదీసింది. దీంతో పిల్లలకు నచ్చచెప్పి వారితో కలిసి ఆత్మహత్య (Family Suicide News) చేసుకుంది. వసంత తమ్ముడు ఆమెకు ఫోన్ చేసినా.. ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఇంటికి వెళ్లి చూడగా.. పిల్లలతో పాటు ఆమె కూడా ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది.
వసంత చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ (Suicide Note) రాసింది. అందులో తన భర్త కరోనాతో చనిపోయిన తరువాత తమ జీవితం ఎలా మారిందో వివరించింది.
మీ నాన్న దగ్గరకు తీసుకెళ్తాను...
నా భర్తను మర్చిపోవాలని నేను చాలా ప్రయత్నించాను. అది సాధ్యం కాదని తెలుసుకున్నాను. నా భర్త దూరమైన నాటి నుంచి నేను ప్రతిరోజు జీవచ్ఛవంలా బతుకుతున్నాను. నన్ను, నా పిల్లలను చూసుకోవడానికి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. దీనితో తోడు ఇవన్నీ మర్చిపోయి.. ముందుకు సాగాలంటే పిల్లలు, ఇంటికి తీసుకొన్న లోన్ అనే రెండు బాధ్యతలు నన్ను వెంటాడుతున్నాయి. ఇంటిని అమ్మి వచ్చిన డబ్బుతో ఇంటి రుణం తీరుతుంది. కానీ మమ్మల్ని ముందుండి నడిపించే వ్యక్తి ఎవరూ లేరు అనే ఈ కఠిన సత్యాన్ని గ్రహించి.. మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం. నా పిల్లలకు కూడా ఇదే విషయాన్ని చెప్పాను. మనం నాన్న దగ్గరకు వెళ్తున్నాం అని. వారు కూడా ఒప్పుకున్నారు.
- సూసైడ్ నోట్ సారాంశం
మృతదేహాలను స్వాధీనం చేసుకున్న మదనయకనహళ్లి పోలీసులు.. దీనిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: వేరే మహిళతో సంబంధం- కుటుంబీకులంతా కలిసి హత్య