వేతనాలు చెల్లించటం లేదంటూ కర్ణాటక కోలార్ జిల్లాలోని విస్ట్రాన్ కార్పొరేషన్ ఐఫోన్ తయారీ పరిశ్రమలో ఉద్యోగులు విధ్వంసానికి దిగిన ఘటనలో సంస్థకు భారీగా నష్టం వాటిల్లింది. సుమారు రూ.437.40 కోట్ల మేర నష్ట వచ్చిందని సంస్థ వెల్లడించింది. ఈ మేరకు శనివారం జరిగిన ఘటనపై కోలార్ జిల్లాలోని వేమగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
సుమారు రూ.412.50 కోట్లు విలువైన కార్యాలయ సామగ్రి, మొబైల్ ఫోన్లు, ఉత్పత్తి యంత్రాలు, వాటికి సంబంధించిన వస్తువులు ధ్వంసమైనట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ టీడీ ప్రశాంత్ తెలిపారు. అలాగే.. రూ.10 కోట్లు విలువైన మౌలిక సదుపాయాలు, రూ.60 లక్షల విలువైన కార్లు, గోల్ఫ్ కార్ట్స్, స్మార్ట్ఫోన్లు, రూ.1.5 కోట్ల ఇతర గాడ్జెట్స్లను ధ్వంసం చేయటం, ఎత్తుకెళ్లటం వంటివి చేశారని చెప్పారు. తమ పరిశ్రమలో 5000 మంది కాంట్రాక్టు కార్మికులు, మరో 2000 మంది గుర్తు తెలియని దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రశాంత్.
" నరసాపుర పరిశ్రమలో కార్మికుల చర్య దిగ్భ్రాంతికి గురిచేసింది. మేము చట్టాన్ని అనుసరిస్తాం. దర్యాప్తు చేసే అధికారులకు సహకరిస్తాం. మా బృందం సభ్యుల భద్రత, రక్షణకే మా తొలి ప్రాధాన్యం."
- సుదీప్తో గుప్తా, విస్ట్రాన్ ఇండియా ఎండీ.
ఈ ఘటన సంబంధించి ఇప్పటి వరకు 149 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.
పరిశ్రమలో విధ్వంసాన్ని తీవ్రంగా ఖండించింది కర్ణాటక ప్రభుత్వం. సంస్థ అధికారుల భద్రతతో పాటు గొడవకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చింది.
ఇదీ చూడండి: జీతాలు చెల్లించలేదని కార్మికుల విధ్వంసం