నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ దిల్లీ చుట్టుపక్కల నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు.. కేంద్ర ప్రభుత్వంతో ఆరో విడత చర్చలకు సిద్ధమయ్యాయి. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ ఇటీవల రాసిన లేఖపై.. శనివారం చర్చించిన రైతు సంఘాలు సమావేశానికి సిద్ధం అని ప్రకటించాయి. ఈ మేరకు 40 రైతు సంఘాల నేతృత్వంలోని సంయుక్త కిసాన్ మోర్చా.. చర్చలకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించాలని ప్రభుత్వానికి వర్తమానం పంపింది.
డిమాండ్ మాత్రం అదే..
అయితే రైతు సంఘాలు తమ డిమాండ్లపై మాత్రం వెనక్కి తగ్గలేదు. వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత అంశాలు సమావేశం ఎజెండాలో ఉండాల్సిందే అని స్పష్టం చేశాయి. రాజధాని ప్రాంతం, దాని చుట్టుపక్కల ప్రదేశాల్లో పంట వ్యర్ధాలను కాల్చే రైతులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ ఆర్డినెన్స్‌లో సవరణల అంశాన్ని కూడా చర్చించాలని స్పష్టం చేశాయి.
రద్దు చేయకుంటే ఉద్ధృతమే..
29న చర్చల సందర్భంగా సాగు చట్టాల రద్దు గురించి కేంద్రం మాట్లాడకుంటే.. ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. మరుసటి రోజు(డిసెంబర్ 30).. సింఘూ సరిహద్దు నుంచి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
''కొత్త చట్టాల రద్దు గురించి డిసెంబర్ 29న కేంద్రం మాట్లాడకుంటే.. మరుసటి రోజు సింఘూ-టిక్రీ- షాజహాన్ పుర్ మీదుగా వందలాది ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తాం.''
- రాజిందర్ సింగ్, కీర్తి కిసాన్ సంఘం
5 సార్లు అసంపూర్తిగానే..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రైతు సంఘాలతో ఐదు విడతలుగా చర్చలు జరిపింది. ఓసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా చర్చలు జరిపారు. అయితే.. అన్నీ అసంపూర్తిగానే ముగిశాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29న ఆరో దఫా చర్చలకు సిద్ధమైంది కేంద్రం.
ఇదీ చూడండి: రైతులకు మద్దతుగా ఎన్డీఏ నుంచి వైదొలిగిన ఆర్ఎల్పీ