బంగాల్ ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇటీవల యాస్ తుపాను మిగిల్చిన వినాశనాన్ని చూసేందుకు ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో కలిసి సమీక్ష నిర్వహించనున్నారు. పశ్చిమ మేదినీపుర్ జిల్లాలోని కలైకుండలో శుక్రవారం సమావేశం జరుగుతుందని మమత తెలిపారు. మోదీ, మమత, బంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బండియోపాధ్యాయ కలసి తుపాను ప్రభావిత ప్రాంతాలైన పుర్బా, మేదినిపుర్, దక్షిణ,ఉత్తర 24 పరగణాలలో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.
"యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన చేపట్టనున్నారు. మొదటగా దిఘాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఆ తరువాత కలైకుండలో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. "
-మమత బెనర్జీ, బంగాల్ సీఎం
ఒడిశా పర్యటన..
బంగాల్ పర్యటన కంటే ముందుగా ప్రధాని ఒడిశాలో పర్యటించనున్నారు. యాస్ తుపాను సృష్టించిన కల్లోలాన్ని ఏరియల్ సర్వే ద్వారా వీక్షించనున్నారు. అనంతరం బంగాల్ చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి తిరుగు పయనమవుతారు .
ఇదీ చూడండి: 50 ఏళ్లలో 117 తుపాన్లు.. 88 శాతం తగ్గిన ప్రాణనష్టం