'తమిళ పోరు' అంటే అందరికీ గుర్తొచ్చే పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే. గత 24ఏళ్లుగా ఒకదాని తర్వాత ఒకటి అధికారాన్ని చేపడుతూ రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి ఈ పార్టీలు. వీటి ప్రభావానికి రాష్ట్రంలోని స్థానిక పార్టీలు కొట్టుకుపోతూ ఉంటాయి. లేదా వాటిల్లో కలిసిపోతూ ఉంటాయి. ఇది ఎప్పుడూ జరిగే విషయమే. అయితే ఈ దఫా ఎన్నికల్లో మాత్రం ఓ చిన్న పార్టీ.. పెద్ద పార్టీలకు గట్టి పోటీనిస్తోంది. అది కూడా ఏ పొత్తులూ లేకుండా! అదే సీమన్‌కు చెందిన నామ్ తమిళర్ కచ్చి(ఎన్టీకే). అసలు.. దిగ్గజ పార్టీలనే ఢీకొట్టే స్థాయికి ఎన్టీకే ఎలా ఎదిగింది? మరి ఈ ఎన్నికల్లో ప్రజలపై ఆ పార్టీ ప్రభావమెంత? ఇంతకీ సీమన్ ఎవరు?
దర్శకత్వం టు రాజకీయం...
సినీ దర్శకుడు సీమన్ అధ్యక్షతన ఎన్టీకే తొలి సమావేశం మధురై వేదికగా 2009 మే 18న జరిగింది. 'తమిళ జాతీయవాదం'తో ముందుకు సాగుతూ.. పార్టీని బలోపేతం చేశారు సీమన్. రాష్ట్ర ప్రజల్లో.. తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. భారీ సంఖ్యల్లో యువత ఆయన అడుగుజాడల్లో నడవడం మొదలుపెట్టారు. ఆయన్ను ఓ సోదరుడిగా, మార్గనిర్దేశకుడిగా భావిస్తున్నారు.
ఇదీ చూడండి:- తమిళనాట మరోసారి సంస్కృత పేర్లపై వివాదం!
సీమన్‌కు వ్యతిరేకంగా ఆయన ప్రత్యర్థులు అనేక అస్త్రాలను సంధించారు. కానీ అవి బెడిసికొట్టిన సందర్భాలే ఎక్కువే. ముఖ్యంగా.. ఎల్టీటీఈ నేత వేలుపిళ్లై ప్రభాకరన్ పేరు చెప్పుకుని సీమన్ ఎదుగుతున్నారని ఆరోపించారు. కానీ సీమన్ మద్దతుదారులు ఆ ఆరోపణలకు గట్టి సమాధానం ఇచ్చారు. సీమన్ లేకపోయుంటే.. ఎల్టీటీఈ కార్యకలాపాలు ఈ తరానికి తెలిసేవే కావని చెబుతున్నారు.
సీమన్ మద్దతుదారుల్లో యువతే ఎక్కువ. ఇలా యువత ఓటు బ్యాంకును ఆయన సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లో ఎదిగేందుకు ఇది ఎంతో కీలకం. ఇది ఇప్పటికే అనేక మార్లు రుజువైంది కూడా. 1965 హిందూ వ్యతిరేక అల్లర్ల పరిణామాలతో వేలాది మంది యువతను తనవైపు తిప్పుకుని బలమైన మద్దతును కూడగట్టుకున్న డీఎంకే ఇందుకు ఓ ఉదాహరణ. ఆ తర్వాత.. డీఎంకే అధికారాన్ని చేపట్టేందుకు ఎక్కువ సమయం(1967 ఎన్నికలు) పట్టలేదు.
సీమన్ కూడా తన నాయకత్వ లక్షణాలతో అనేకమందిని ఆకర్షించారు. ఇన్నేళ్లూ.. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ముందుకు సాగారు. ఈ దఫా ఎన్నికలు కూడా అందుకు విరుద్ధమేమీ కాదు.
రహస్య బంధం!
ఎల్టీటీఈ అనేది చాలా వివాదాస్పదమైన అంశం. దానిపై కేంద్ర నిషేధం కూడా ఉంది. అలాంటి ఎల్టీటీఈ, ప్రభాకరన్ పేర్లను ఉపయోగించుకుంటారు సీమన్. ప్రసంగాల్లో, సభల్లో ఆ అంశాలను ప్రస్తావిస్తుంటారు. ఇది చట్ట విరుద్ధమని, సీమన్పై న్యాయపరంగా చర్యలు చేపట్టే అవకాశముందని రాజకీయ నిపుణలు అభిప్రాయపడుతున్నారు.
కానీ ఇప్పటి వరకు అలాంటివేవీ జరగలేదు. సీమన్‌కు అధికారంలోని అన్నాడీఎంకే, భాజపా మధ్య రహస్య మైత్రి ఉండటమే ఇందుకు కారణమని పలువురు ఆరోపించారు. వారి ఆరోపణలకు కారణాలు లేకపోలేవు.
ఇదీ చూడండి:- తమిళనాట వాళ్లు లేకపోయినా వాడీవే'ఢీ'!
2011 అసెంబ్లీ ఎన్నికలను ఎన్టీకే బహిష్కరించింది. అయినప్పటికీ.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారాలు నిర్వహించారు సీమన్. అయితే.. "ఆకులు వికసిస్తేనే... ఈలం వికసిస్తుంది.." అని నినాదం చేశారు. అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండు ఆకాలు.. ఈలం అంటే శ్రీలంక కావడం గమనార్హం.
అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఎన్టీకే ప్రచారం చేయడం చాలా తక్కువగా కనిపిస్తుంది. భాజపా-డీఎంకేతో సిద్ధాంతాల పరంగా పోరాడే సీమన్ పార్టీ.. అన్నాడీఎంకేను మాత్రం పక్కన పెడుతుంది.
దీనికి పలు కారణాలను చెబుతూ ఉంటారు ద్రవిడ సిద్ధాంతాలను వ్యతిరేకించే ఎన్టీకే కార్యకర్తలు. ఆ సిద్ధాంతాలు అన్నాడీఎంకేలో నామమాత్రమేనని.. అందుకే తాము డీఎంకేను లక్ష్యంగా చేసుకుంటామని అంటుంటారు.
అయితే మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళతో సీమన్ ఇటీవలే భేటీకావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై డీఎంకే తీవ్ర ఆరోపణలు చేసింది.
కేరాఫ్ వివాదాలు...
ప్రభాకరన్ అంశమే కాకుండా.. సీమన్ చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. తమిళ జాతి సార్వభౌమత్యాన్ని ప్రచారం చేస్తున్నారని, మైనారిటీలను పట్టించుకోరని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఆయన మద్దతుదారుల నుంచి బలమైన సమాధానాలే వినపడుతున్నాయి. సీమన్ మైనారిటీలకు వ్యతిరేకం కాదని.. ప్రస్తుత ఎన్నికల్లో మైనారిటీలకు పెద్ద పీట వేశామని అంటున్నారు. మహిళలు 50శాతం సీట్లు కేటాయించినట్టు చెబుతున్నారు.
స్టాలిన్‌తో సై అని...
డీఎంకే అధినేత స్టాలిన్.. కోలాథుర్ నుంచి పోటీ చేస్తే.. తాను కూడా అక్కడ నుంచే బరిలో దిగుతానని అన్నారు సీమన్. కానీ చివరికి తన మనసు మార్చుకున్నారు. 'అదానీ నౌకాశ్రయం విస్తరణ ప్రణాళికను అడ్డుకునేందుకే నేను తిరువొట్రియూర్ నుంచి పోటీ చేస్తున్నా' అని ప్రకటించారు. అయితే ఆ కారణానికి, ఎన్నికలకు ఉన్న సంబంధం గురించి ఎవరికీ అర్థంకాలేదు.
ఇదీ చూడండి:- తమిళ సీఎం అభ్యర్థుల ఆస్తుల లెక్కలు తెలుసా?
జింకను వేటాడే పులి...
ఏది ఏమైనా.. సీమన్ మద్దతుదారులు మాత్రం ఆయనకు అండగా నిలుస్తున్నారు. ద్రవిడ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
"50ఏళ్లుగా.. ద్రవిడ పార్టీలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయి. ఎన్టీకే ఒక్కటే వాటికి వ్యతిరేకంగా పోరాడుతోంది. మేము జింకలను వేటాడే పులులము. ఇది ద్రవిడ సిద్ధాంతాలకు- తమిళ జాతీయవాదానికి మధ్య జరుగుతున్న యుద్ధం."
--- వినోథ్ అరథంగి, ఎన్టీకే నేత
తాము ఎవరితోనూ పొత్తు కుదుర్చుకోమని, ఏదో ఒక రోజున రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎన్టీకే కార్యకర్తలు ధీమాగా ఉన్నారు.
సీమన్ సత్తా చాటేనా?
2011 పోలింగ్ బహిష్కరణ అనంతరం... 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగిన ఎన్టీకే.. 1.1శాతం ఓట్లకు ఖాతాలో వేసుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇది 4శాతానికి పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది ఏకంగా 10శాతానికి చేరింది. ఏప్రిల్ 6న జరగనున్న ఎన్నికల్లో ఈ గణాంకాలను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది.
మరి ఈసారి సీమన్ ఎన్టీకే ప్రభావం తమిళులపై ఎంత మేరకు ఉంది? అసెంబ్లీలో ఆయన అడుగుపెడతారా? అనేది మే 2నే తెలుస్తుంది.
ఇదీ చూడండి:- సీఏఏపై అన్నాడీఎంకే యూటర్న్- భాజపా పరేషాన్!