జాతీయస్థాయిలో భాజపాను ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీల కూటమి ఏర్పాటైతే, ఎవరు నాయకత్వం వహిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినాయకురాలు మమతా బెనర్జీ నాయకత్వం పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే దిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన మమత.. ఎలాంటి స్పష్టతనివ్వలేదు.
"నేను రాజకీయ జ్యోతిషురాల్ని కాదు. పరిస్థితులు, పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరు నాయకత్వం వహించినా.. ఫర్వాలేదు. ఆ విషయంపై చర్చించి.. నిర్ణయం తీసుకుంటాం. భాజపాను ఎదుర్కోవడానికి విపక్షాలకు సహాయం చేయాలనుకుంటున్నా. నేను నాయకురాలిని కాదు. సాధారణ కార్యకర్తను మాత్రమే. దేశవ్యాప్తంగా ఆట ఆరంభమైంది. ఇది కొనసాగుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశం మొత్తం మోదీకి వ్యతిరేకంగా నిలుస్తుంది. దేశం వెర్సస్ మోదీగా ఎన్నికలు జరుగుతాయి."
- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
సోనియాతో మమత భేటీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో భేటీ అయ్యారు మమత. దిల్లీలోని జనపథ్ సోనియా ఇంట్లో జరిగిన ఈ సమావేశంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో రాజకీయ పరిస్థితులు, కొవిడ్, పెగసస్ వ్యవహారం సహా విపక్షాల ఐక్యతపై చర్చించినట్లు మమత పేర్కొన్నారు. ఈ భేటీతో భవిష్యత్‌లో సానుకూల ఫలితాలు వస్తాయన్నారు.
"భాజపా బలంగా ఉంది. దానిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు మరింత బలంగా తయారై.. 2024లో చరిత్ర సృష్టిస్తాయి. అయితే భాజపాను ఎదుర్కోవడానికి అందరూ కలిసి పని చేయాలి. రాజకీయాల్లో పరిస్థితులు మారతాయి" అని మమత పేర్కొన్నారు.
ఐటీ, ఈడీ దాడులను ఉద్దేశించి.. కేంద్రాన్ని వ్యతిరేకించే వారి వద్దే నల్లధనం ఉంటుందా? అని ప్రశ్నించారు బంగాల్ సీఎం.
కేజ్రీవాల్‌తో భేటీ..
మమతా బెనర్జీతో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం భేటీ అయ్యారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ అధికారిక ప్రకటనలో వెల్లడించారు. "బంగాల్లో ఘన విజయం పొందాక మమతా దీదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. ప్రస్తుత రాజకీయాలపై చర్చించాము" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసంలో కేజ్రీవాల్ దీదీని కలిసారు.
పెగసస్‌తో అందరికీ ముప్పు!
పెగసస్‌తో అందరి జీవితాలు ప్రమాదంలో పడ్డాయని మమత వ్యాఖ్యానించారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైందన్నారు. అభిషేక్ ముఖర్జీ ఫోన్ ట్యాపింగ్ అయిందంటే.. ఆయనతో మాట్లాడిన తన ఫోన్ కూడా హ్యాకింగ్ గురైనట్టేనని పేర్కొన్నారు దీదీ. పెగసస్‌తో ప్రస్తుత పరిస్థితి.. అత్యవసర పరిస్థితి కంటే ఆందోళనకరంగా మారిందన్నారు.
"పెగసస్‌పై కేంద్రం ఎందుకు నోరు విప్పడం లేదు? దాని గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. పార్లమెంటులో విధాన నిర్ణయాలు తీసుకోకపోతే, అక్కడ చర్చలు జరపకపోతే, మరి ఎక్కడ జరుగుతాయి?" అని ప్రభుత్వాన్ని దీదీ ప్రశ్నించారు.
ఇదీ చూడండి: 'పెగసస్‌ను కేంద్రం కొనుగోలు చేసిందా? లేదా?'