సాగు చట్టాల విషయంలో కేంద్రం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రైల్వే ట్రాక్‌లను దిగ్బంధిస్తామని రైతు సంఘాలు గురువారం తేల్చిచెప్పాయి. ఈ అంశంపై త్వరలోనే తేదీని వెల్లడిస్తామని పేర్కొన్నాయి. దిల్లీ సింఘూ సరిహద్దు వద్ద కూడా ఆందోళనను తీవ్రతరం చేస్తామని, దేశ రాజధాని దిల్లీకి వెళ్లే అన్ని రహదారులను అడ్డుకోవడం ప్రారంభిస్తామని పునరుద్ఘాటించాయి.
'వ్యవసాయం రాష్ట్ర జాబితా అంశం. దీనిపై శాసనాలు చేయడానికి కేంద్రానికి ఎలాంటి హక్కులు లేవు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ చట్టాలను కేంద్రం తీసుకొచ్చింది.' అని ఆరోపించాయి.
కేంద్రం భరోసా.. అయినా..
వ్యవసాయ చట్టాలపై చర్చలు జరిపేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. తక్షణమే నిరసనలు విరమించి.. కేంద్రం ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో రైతు సంఘాలు ఈ తాజా హెచ్చరికలు చేశాయి.
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలు 15వ రోజూ హస్తిన సరిహద్దుల్లో ఆందోళన కొనసాగించారు. దిల్లీ-హరియాణా మార్గంలోని టిక్రీ, సింఘూ సరిహద్దు వద్ద వేలాది మంది రైతులు బైఠాయించి తమ నిరసన సాగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.
ఇదీ చూడండి: 'నిరసనలు విరమించండి- చర్చకు కేంద్రం సిద్ధం'