"మమత దెబ్బతిన్న పులి. మమత ఆకలి మీదున్న సింహం. మమత గర్జిస్తే.. ప్రత్యర్థులు గజగజ వణకాల్సిందే"... బంగాల్ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి శివసేన అంటున్న మాటలు. భాజపాను ప్రత్యక్షంగా ఢీకొట్టగలిగే అతికొద్ది మంది విపక్ష నేతల్లో మమత ఒకరు. ఆమె ధైర్యాన్ని చాటిచెప్పేందుకు ఈ ఒక్క మాట చాలు. అయితే.. ఒక్కరోజులో మమత ఆ స్థాయికి చేరుకోలేదు. దేశంలో అగ్రనేతల్లో ఒకరిగా ఎదిగేందుకు తీవ్రంగా శ్రమించారు. దీదీ జీవితం వెనక ఎన్నో త్యాగాలు.. మరెన్నో గాయాలు ఉన్నాయి.
గాయాలు.. ఆమెకు విజయ సోపానాలు
ఇటీవల నందిగ్రామ్‌లో.. మమత నామినేషన్ దాఖలు చేసి వస్తూ కారు ఎక్కుతుండగా తనను తోసేశారని, తన కాలు తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించారు. ఆసుపత్రిలో చేరి రెండు రోజులు తరువాత డిశ్ఛార్జి అయ్యారు. అయితే దీదీకి గాయాలవడం ఇది తొలిసారి కాదు. ఎదురుదెబ్బలను చవిచూసి.. బెదురు పుట్టించి.. వాటినే అస్త్రాలుగా మలుచుకుని.. మూడు దశాబ్దాల ఎర్రకోట(కమ్యూనిస్టుల పాలన)ను బద్దలు కొట్టిన నైజం ఆమెది. అలాంటి దీదీకి మరోసారి భాజపా రూపంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురైంది. మమత ఆరోపిస్తున్నట్లు.. గతంలోనూ ఇలాగే ఆమెపై చాలా సార్లు దాడులు జరిగాయి. ఆ దాడులే ఆమె విజయానికి సోపానాలై.. సీఎం అయ్యేందుకు దోహదపడ్డాయి.
ఇదీ చదవండి: 'దీదీకి తీవ్ర గాయాలు- ఎముకలో పగులు'
మొదటి దాడి..
1990 ఆగస్టు 16న మొట్టమొదటి సారిగా ఆమెపై దాడి జరిగింది. అప్పటి అధికార పార్టీ సీపీఎం.. యూత్ వింగ్ డీవైఎఫ్ఐ నేత లాలూ ఆలం.. మమత తలపై కర్రతో కొట్టారు. దాంతో ఆమె తల పగిలింది. ఆ సంఘటన బంగాల్లో సంచలనమైంది. ఆమె పేరు.. బంగాల్ అంతటా మార్మోగింది.
రెండో దాడి.. 1993, జనవరిలో జరిగింది. అప్పుడు ఆమె యూత్ కాంగ్రెస్ నాయకురాలు. అధికార సీపీఎం పార్టీకి చెందిన నాయకుడొకరు.. దివ్యాంగురాలైన ఓ మహిళపై అత్యాచారం చేసి ఆమె గర్భవతి కావడానికి కారకుడయ్యారని దీదీ ఆరోపించారు. ఆరోపణలతోనే ఆమె ఆగలేదు. బాధితురాల్ని రైటర్స్ బిల్డింగ్‌కు తీసుకెళ్లి తన నిరసనను వ్యక్తం చేశారు. అధికార పార్టీ వ్యక్తి కావడం వల్ల నిందితున్ని అరెస్టు చేయటం లేదని, తక్షణమే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 గంటలపాటు సీఎం జ్యోతిబసు కార్యాలయం ముందు ధర్నా చేశారు. అక్కడి నుంచి దీదీని వెనక్కి పంపడంలో పోలీసులు విఫలమయ్యారు. అయితే మరికొద్దినిమిషాల్లో.. పోలీసులు చేసే పని రాబోయే రోజుల్లో రాష్ట్రరాజకీయాల్ని సమూలంగా మారుస్తుందని వారప్పుడు ఊహించలేదు. ఎంతకీ ఆమె అక్కడి నుంచి కదలకపోవడం వల్ల.. పోలీసులు దీదీ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి లాల్‌బజార్ జైల్లో వేశారు. ఈ దారుణమైన సంఘటన రాష్ట్రంలో ప్రకంపనలు రేపింది.
మూడో ఘటన.. 2000-01లో కాంగ్రెస్ నుంచి తెగదెంపులు చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు మమత. ఇక.. సీపీఎం- తృణమూల్ మధ్య తీవ్ర పోరు నడిచింది. మిడ్నాపుర్ జిల్లా, కేశాపుర్, చామఖైతాలాలో కొందరు ఆందోళనకారులు చేసిన దాడిలో పలువురు తృణమూల్ కార్యకర్తలు చనిపోయారు.
వారిని చూసేందుకు ఛోటో అంగారియాకు వెళ్తుండగా మమత కారుపై బాంబులు విసిరారు.
ఇదీ చదవండి: కార్యకర్తలు సంయమనం పాటించాలి: దీదీ
2006-07లో వరుస దాడులు..
ఆ తర్వాత 2006-07లో ఆమెపై వరుస దాడులు జరిగాయి. ఓ ప్రముఖ కంపెనీకి భూముల్ని ఇవ్వాలని అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో నందిగ్రామ్ భగ్గుమంది. భూములు ఇవ్వడానికి అక్కడి ప్రజలు ఒప్పుకోలేదు. భూముల్ని ఇచ్చేది లేదని పట్టుదలతో ఉన్న ప్రజలకు.. దీదీ రూపంలో కొండంత అండ దొరికింది. దాంతో భూసేకరణ వ్యతిరేక ఉద్యమం తీవ్రతరమైంది. నందిగ్రామ్‌కు వెళ్లకుండా దీదీని కొందరు ఆందోళనకారులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆమె కారుపై బాంబులు వేశారు. కారుకు నిప్పుపెట్టారు. అయినా దీదీ బెదరలేదు. వెనక్కితగ్గలేదు.
బంగాల్ ముఖచిత్రాన్ని మార్చిన ఘటన..
2006లో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు మమత. దాంతో ఆమెను మరోసారి పోలీసులు ఈడ్చిపడేశారు. ఈ ఘటన, నందిగ్రామ్‌లో జరిగిన భూసేకరణ వ్యతిరేక ఉద్యమం.. అప్రతిహతంగా బంగాల్‌ను ఏలుతున్న కమ్యూనిస్టుల పాలనకు చరమగీతం పాడాయి.
2010లో రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు దీదీ.. కాన్వాయ్‌ని ట్రక్కుతో ఢీకొట్టించారు. ఇది తనను చంపడానికి ప్రత్యర్థులు పన్నిన కుట్ర అని.. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే లాల్గఢ్కు ర్యాలీగా వెళ్లి మరీ చెప్పారు.
ఆ తర్వాత 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. మరోసారి జరిగిన 2016 ఎన్నికల్లోనూ జైత్రయాత్ర కొనసాగించింది.
తాజా నందిగ్రామ్ ఘటన
టీఎంసీ అధికారంలోకి వచ్చాక.. ఆమెపై దాడులు జరగలేదు. మళ్లీ చాలా ఏళ్లకు నందిగ్రామ్‌లో తనను కావాలనే తోసేశారని మమత ఇప్పుడు ఆరోపిస్తున్నారు. అయితే అదంతా కుట్ర అని ప్రతిపక్షాలు అంటున్నాయి. కారు డోరు తగలడం వల్లనే ఆమె కాలుకు గాయం అయిందని చెబుతున్నాయి. కొందరు కావాలని చేసిన కుట్రవల్లే మమతకు గాయాలయ్యాయని తృణమూల్ ఆరోపిస్తోంది.
ఇదీ చూడండి: మమతకు గాయం: కుట్రా? నాటకమా?
'దీదీ వ్యూహమా?'
కేవలం సానుభూతి కోసమే మమత ఇలాంటి డ్రామాకు తెరలేపారని భాజపా విమర్శిస్తోంది. ఇది పక్కా స్క్రిప్ట్‌తో తృణమూల్ రచించిన వ్యూహమని అంటోంది. తాజాగా నందిగ్రామ్‌లో జరిగిన ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ సైతం ఇలాంటి విమర్శలే చేసింది.
గతంలో జరిగిన దాడులకు ఏమాత్రం భయపడని, వెనక్కితగ్గని మమత అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు అయిన గాయం నుంచి కోలుకొని.. మరోసారి ఎన్నికల సంగ్రామంలో సత్తా చూపిస్తారా? ఇవన్నీ మరోసారి దీదీకి అధికారాన్ని కట్టబెడతాయా? 'అలుపెరగని పోరాటయోధురాలి'గా చెప్పుకొనే తన ముద్రను నిలుపుకుంటారా? అసలు బంగాల్ ప్రజలు ఏమనుకుంటున్నారు? తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వెలువడే మే2 వరకు వేచిచూడాల్సిందే.
ఇదీ చూడండి: ఆర్ఎస్ఎస్, భాజపా మధ్య దూరం పెరిగిందా?