భర్త పనిచేసే ఆఫీసుకు భార్య వెళ్లి పది మంది ముందు అతడిని అసభ్య పదజాలంతో తిడుతూ వేధించడం క్రూరత్వమే అవుతుందని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు అభిప్రాయపడింది. ఓ విడాకుల కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
అసలేం జరిగిందంటే?.. ధంతరి జిల్లాకు చెందిన 32 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగికి 2010లో రాయ్‌పుర్‌కు చెందిన ఓ మహిళతో వివాహమైంది. కొంతకాలానికి వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడం వల్ల భర్త.. విడాకుల కోసం రాయ్‌పుర్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన భార్య తరచూ వేధిస్తోందని, కనీసం తన తల్లిదండ్రులను కూడా కలుసుకోనివ్వట్లేదని పేర్కొంటూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ కేసులో వాదోపవాదాలు, సాక్ష్యాలను పరిగణించిన అనంతరం 2019 డిసెంబరులో న్యాయస్థానం వీరికి విడాకులు మంజూరు చేసింది.
అయితే కుటుంబ న్యాయస్థానం ఆదేశాలను సవాల్ చేస్తూ అతడి భార్య హైకోర్టును ఆశ్రయించింది. తన భర్త తప్పుడు సాక్ష్యాలు చూపించాడని, ఆ ఉత్తర్వులపై జోక్యం చేసుకోవాలని పిటిషన్ దాఖలు చేసింది. ఆ ఆరోపణలను భర్త తోసిపుచ్చాడు. తనకు వివాహేతర సంబంధం ఉందని భార్య చేసిన తప్పుడు ఆరోపణల కారణంగా తన పరువుకు భంగం కలిగిందని న్యాయస్థానానికి తెలిపాడు. అక్కడితో ఆగకుండా తన భార్య ఆఫీసుకు వచ్చి మరీ తనను అసభ్య పదజాలంతో దూషించిందని, తనను బదిలీ చేయించేందుకు ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసిందని వాపోయాడు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. రాయ్‌పుర్ కుటుంబ న్యాయస్థానం మంజూరు చేసిన విడాకులను సమర్థించింది.
ఇవీ చదవండి: అక్కడ రోజుకు ఇద్దరు బాలికలపై అఘాయిత్యాలు.. దేశంలో రోజూ 82 హత్యలు