కర్ణాటక బెంగళూరులోని యెళహంకలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఈ ఘటనలో మృతుడి భార్య శ్వేత, ఆమె ప్రియుడు సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌కు శ్వేత అనే మహిళతో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. శ్వేత.. చంద్రశేఖర్‌కు స్వయానా మేనకోడలు. శ్వేత కంటే చంద్రశేఖర్ 16 ఏళ్లు పెద్దవాడు. పెళ్లైన తర్వాత శ్వేత కాలేజీకి వెళ్లేది. కళాశాలలో శ్వేతకు కొందరు యువకులతో స్నేహం ఏర్పడింది. ఈ విషయమై చంద్రశేఖర్, శ్వేత మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ విషయం కుటుంబ సభ్యులు తెలియడం వల్ల దంపతులకు నచ్చజెప్పి ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం నుంచి బెంగళూరుకు మకాం మార్పించారు. నాలుగు నెలల నుంచి చంద్రశేఖర్ దంపతులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. అప్పటికే శ్వేత.. హిందూపురానికి చెందిన సురేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. బెంగళూరు మకాం మార్చినా.. వీరి వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ విషయం శ్వేత భర్త చంద్రశేఖర్‌కు తెలియడం వల్ల ఇంట్లో పెద్ద గొడవ జరిగింది.
ఈ క్రమంలో శ్వేత తన ప్రియుడితో కలిసి చంద్రశేఖర్‌ను హతమార్చాలని ప్లాన్ వేసింది. చంద్రశేఖర్‌ను అంతమొందించాలనే పక్కా ప్రణాళికతో సురేష్ అక్టోబరు 22న సురేశ్.. బెంగళూరు వచ్చాడు. తనతో మాట్లాడాలని చంద్రశేఖర్‌ను సురేశ్ డాబాపైకి తీసుకెళ్లాడు. వీరిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలో చంద్రశేఖర్ తలపై కర్రతో సురేశ్ దాడి చేశాడు. దీంతో చంద్రశేఖర్ తీవ్ర రక్తస్రావమై కింద పడిపోయాడు. అనంతరం సురేశ్.. చంద్రశేఖర్ జననాంగాలను కోసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. భర్త హత్య జరిగిన సమయంలో భార్య శ్వేత ఇంట్లోనే ఉన్నా ఏమి తెలియనట్లు నటించింది. భర్త మరణాంతరం కన్నీరుమున్నీరుగా విలపించింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది.
చాక్లెట్లు ఆశచూపి..
ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లో దారుణం జరిగింది. మైనర్‌పై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దాడికి అతడి భార్య కూడా సహకరించింది. ఈ ఘటనపై లోధా పోలీసులకు బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేసింది. చాక్లెట్లు, డబ్బులు ఇస్తానని మైనర్‌ను ఇంటికి పిలిచి.. ఆమె బట్టలు తీసి ప్రైవేట్ భాగాలపై లైంగిక దాడికి పాల్పడేవాడు. నిందితుడికి అతడి భార్య సీమా కూడా సహకరించేది. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
బోటు బోల్తా..
బిహార్ భాగల్‌పుర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గంగానదిలో బోటు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గోపాల్‌పుర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
నిర్మాతపై కేసు..
ప్రముఖ సినీ నిర్మాత కమల్ కిశోర్‌పై ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కారుతో ఢీకొట్టి.. గాయపరిచాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అక్టోబర్ 19న అంధేరిలో జరిగిన ఈ ఘటనపై తాజాగా కేసు నమోదైంది. కమల్ ఇంటికి బాధితురాలు వెళ్లినప్పుడు అతని కారులో మరో మహిళను ఆమె గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎదురుగా వెళ్లి కారు ఆపమని కోరింది. ఈ క్రమంలో కమల్.. ఎదురుగా ఉన్న తన భార్యను ఢీకొట్టాడు. ఆమె కాళ్లు, చేతులు, తలకు గాయాలయ్యాయి.
క్రాకర్స్ పేల్చుతుండగా..
మధ్యప్రదేశ్ మందసౌర్‌లో విషాదం నెలకొంది. టిఫిన్ బాక్స్ కింద క్రాకర్స్‌ను పెట్టి పేల్చింది 19 ఏళ్ల యువతి. అయితే స్టీల్ బాక్స్ ముక్కలు చీలిపోయి యువతి కడుపులో గుచ్చుకున్నాయి. ఈ క్రమంలో యువతిని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
రెజ్లర్ సోదరుడిపై కాల్పులు..
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని జఖరాలో దారుణం జరిగింది. అంతర్జాతీయ రెజ్లర్ రాణి రాణా సోదరుడు దిగ్విజయ్ సింగ్ రాణా, ఆతని కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపారు ఐదుగురు దుండగులు. ప్రస్తుతం రాణి సోదరుడు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఐదుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పొలంలో పని ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. నిందితుల ఆయుధాల లైసెన్స్‌లను రద్దు చేయాలని అధికారులను బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: గుజరాత్లో త్రిముఖ పోరు.. దళిత ఓటర్ల దయ ఎటువైపో!