తానెప్పుడూ పోటీ చేస్తూ వస్తున్న భవానీపూర్‌ను కాదని, బంగాల్ చరిత్రను మార్చిన నందిగ్రామ్ స్థానం నుంచి మమతాబెనర్జీ ఈ దఫా బరిలో దిగనున్నారు. ఆసక్తికరమైన ఈ నిర్ణయంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. తన ప్రత్యర్థులకు సవాల్ విసిరి, సొంత పార్టీ కార్యకర్తలకు కూడా తానున్నాననే బలమైన అభయం ఇవ్వటానికే దీదీ ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఒక విశ్లేషణ! లేదు లేదు.. భవానీపూర్‌లో ఓడిపోతాననే భయంతో సీటు మారారని అనుమానించే వారూ లేకపోలేదు.
ఆయనే కీలకం
బంగాల్‌లో ఈ దఫా తృణమూల్‌కు భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రమైన ప్రతిఘటన, పోటీ ఎదురవుతోంది. భాజపా అగ్ర నేతలంతా బంగాల్‌పై సర్వశక్తులనూ కేంద్రీకరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలతో పాటు ముఖ్య నేతలంతా రాష్ట్రంలో మొహరిస్తున్నారు. దీనికి తోడు.. తృణమూల్ నుంచే అనేక మంది కీలక నేతలు, స్థానిక కేడర్‌లు భాజపాలో చేరుతుండటంతో అధికార పార్టీ యంత్రాంగంలో ఒకింత గందరగోళం ఏర్పడటం సహజం! అలా తృణమూల్‌కు రాజీనామా చేసి.. భాజపాతో కలసిన నేతల్లో సువేందు అధికారి కీలకం! ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతమే నందిగ్రామ్.
ప్రభావాన్ని పరిమితం చేయాలని..
బంగాల్‌లో 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడటానికి బీజం వేసింది నందిగ్రామ్! ఇక్కడ జరిగిన భూసేకరణ వ్యతిరేక ఉద్యమం చివరకు కామ్రేడ్లను గద్దె దించింది. ఆ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేత సువేందు అధికారి! వీరి కుటుంబానికి ఈ ప్రాంతంలో మంచి పట్టుంది. 2016లో సువేందు తృణమూల్ తరఫున నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సువేందు తండ్రి, అన్నయ్య కూడా ఎంపీలుగా ఉన్నారు. ఈ ప్రాంతంలోని దాదాపు 40 అసెంబ్లీ సీట్లను అధికారి కుటుంబం ప్రభావితం చేస్తుందంటారు. అలాంటి సువేందు తృణమూల్‌కు గుడ్‌బై చెప్పి భాజపాలో చేరారు. ఈ నేపథ్యంలో- కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లుగా మమత ఏకంగా సువేందు ఇలాఖా నుంచే సమరానికి సిద్ధమయ్యారు. తద్వారా తమ పార్టీ కేడర్‌కు బలమైన సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మమత ప్రత్యర్థిగా ఉండటం వల్ల సువేందు, ఆయన కుటుంబం తన నియోజకవర్గంలోనే తమ శక్తియుక్తులను కేంద్రీకరించాల్సి ఉంటుంది. బయటి వాటిపై ప్రభావం తగ్గే అవకాశం ఉంటుందనేది తృణమూల్ వర్గాల అంచనా!
భవానీపూర్‌లో ఓట్లు నానాటికీ తగ్గుతున్నా.. ఓడేంత పరిస్థితి మమతకు ఉండకపోవచ్చు! నిజంగా ఒకవేళ గెలుపుపై అనుమానంతో సీటు మార్చుకోవాలనుకుంటే నందిగ్రామ్‌లాంటి బలమైన స్థానం కంటే మరేదైనా సులభంగా నెగ్గే సీటును మమత చూసుకునేవారనేది కూడా హేతుబద్ధమే! కారణం ఏదైనా, మొత్తానికి మమత సీటు మార్పిడి- బంగాల్ ఎన్నికలకు కొత్త ఊపు తెచ్చింది! మరి బంగాల్ చరిత్రను మార్చిన నందిగ్రామ్ మరోమారు ఆ పని చేస్తుందా అనేది ఆసక్తికరం!
తగ్గుతున్న ఓట్లు..
భవానీపూర్ నుంచి మమత రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తొలిసారి లక్ష ఓట్లకుపైగా మెజార్టీతో అక్కడి ప్రజలు ఘన విజయం కట్టబెట్టారు. 2016లో మాత్రం ఆ మెజార్టీ 25 వేలకు పడిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో భాజపా ఓట్లు మెరుగుపడ్డాయి. దీంతో ఈసారి ఎన్నికల్లో ఏమౌతుందోననే భయంతో, ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మమత సీటు మార్చుకున్నారనేది ప్రత్యర్థుల విశ్లేషణ!
ఇవీ చదవండి: