ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా హెడ్‌క్వార్టర్స్ నుంచి 12 కి.మీల దూరంలో ఉంది పురయ్ గ్రామం. కొన్నాళ్ల క్రితం వరకు ఆ గ్రామానికి ఏ గుర్తింపూ లేదు. కానీ, ప్రస్తుతం.. ప్రతిభ గల ఈతగాళ్లున్న ఊరుగా పేరుగాంచింది. అక్కడ ప్రతి ఇంటి నుంచి ఓ స్మిమ్మర్ ఉండటం విశేషం.
మురికి చెరువులోనే..
ఊళ్లో ఉన్న డోంగియా అనే మురికి చెరువులోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ తీసుకుంటున్నారు చిన్నారులు. స్విమ్మింగ్‌ను కెరీర్‌గా మలుచుకొని, దేశానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకురావాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. దాదాపు 80 మంది బాలబాలికలు ఈ చెరువులోనే నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అబ్బురపరుస్తున్నారు.
సాయ్ నుంచి పిలుపు..
చిన్నారులు ఊరు చెరువులోనే శిక్షణ పొందుతున్నారని తెలుసుకున్న భారత క్రీడా సమాఖ్య(సాయ్).. తన బృందాన్ని పురయ్కు పంపింది. అక్కడ చిన్నారుల ప్రతిభ చూసి అధికారులు నోళ్లు వెల్లబెట్టారు. పిల్లల్లోంచి 12 మందిని అకాడమీలో శిక్షణ కోసం కూడా ఎంపిక చేశారు. అనంతరం గుజరాత్‌లోని సాయ్‌లో మూడేళ్లు ట్రైనింగ్ పొందిన వారు.. లాక్డౌన్ తర్వాత తిరిగి గ్రామానికి చేరుకున్నారు. మళ్లీ అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు.
అకాడమీలో ఆరేళ్లు శిక్షణ తీసుకున్న చంద్రకళ ఓజా.. తాను స్విమ్మింగ్‌లో ఓనమాలు నేర్చుకున్న పురయ్ చెరువులోనే మళ్లీ ప్రాక్టీస్ సాగిస్తోంది. మెరుగైన వసతులు కల్పిస్తే.. భారత్‌కు ఒలింపిక్ స్థాయిలో పతకం సాధిస్తానని ధీమాగా చెబుతోంది.
పరిస్థితులు వేరు..
దొమన్లాల్ దీవాంగన్.. జాతీయ స్థాయి స్విమ్మర్. తన ఊళ్లోని ఓ వ్యక్తి ఈత కొట్టడం చూసినప్పటి నుంచి దానిపై తనకు ఆసక్తి కలిగిందని చెప్పాడు. అనంతరం.. కోచ్ ఓం ఓజా నుంచి దొమన్లాల్ శిక్షణ తీసుకున్నాడు. తొలుత ఈత గురించి ఏమీ తెలియని తను.. ఆరేళ్లుగా అందులో బాగా రాణిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఊళ్లో నుంచి శిక్షణ కోసం అకాడమీ వెళ్లినప్పుడు వింతగా, అక్కడి పరిస్థితులు భిన్నంగా ఉండేవని చెప్పాడు.
సుదీర్ఘ ప్రాంతాల నుంచి..
ప్రస్తుతం.. పురయ్కు క్రీడా గ్రామంగా పేరొచ్చింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఎంతో మంది చిన్నారులు అక్కడ శిక్షణ తీసుకోవడానికి వస్తున్నారు.
అన్నింట్లో శిక్షణ..
ఈతలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాలుగు ప్రధాన స్టైల్స్ ఉన్నాయి. అవి ఫ్రీ స్టైల్, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్, బటర్‌ఫ్లై. వాటన్నింటిలోనూ పురయ్లోని చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు.
"ఫ్రీస్టైల్ ఈతలో.. ఈతగాడు మొదట కుడి చేయిని, ఆపై ఎడమ చేతిని ముందుకు వెనుకకు కదిలించి నీటిని చీలుస్తూ, కొలనులోకి దూసుకెళ్తాడు. బ్యాక్‌స్ట్రోక్‌లో.. ఈతగాడు తన లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనుకకు ఈత కొడతాడు. బ్రెస్ట్‌స్ట్రోక్‌లో.. తల తిప్పకుండా ఛాతీపై ఈత కొడతాడు. ఈ రకమైన ఈతలో, ఈతగాడు రెండు చేతులను ఒకేసారి కదిలిస్తూ, ఛాతీ సహాయంతో శరీరాన్ని కదిలిస్తాడు. బటర్‌ఫ్లై స్ట్రోక్‌లో.. ఈతగాడు తన రెండు చేతులను నీటి ఉపరితలంపై ముందుకు వెనుకకు కదిలిస్తాడు. ఈత కొట్టేటప్పుడు, ఛాతీ, భుజాలను ఉపరితలంపై బ్యాలెన్స్ చెస్తాడు. పాదాలను ఒకే స్థాయిలో కదిలిస్తాడు." అని లక్కీ ఓజా అనే స్విమ్మర్ వివరించాడు.
ఇదీ చూడండి: అసోం అంతర్జాతీయ పార్కుకు ఆ మూడు ఖడ్గమృగాలు