ప్రధాన నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చి.. ఆ దేశం ముందు మోదీ తలవంచారని ఆరోపించారు. భారత భూభాగంలో అంగుళం కూడా ఎవ్వరూ ఆక్రమించుకోలేరని.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్లో గురువారం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేంద్రంపై మాటల దాడి చేశారు రాహుల్.
"ఈశాన్య లద్ధాఖ్‌లో ఏప్రిల్ 2020లో సైనిక ప్రతిష్టంభన నెలకొంది. భారత బలగాలు ఫింగర్ 4 నుంచి ఫింగర్ 3కి రానున్నాయి. ఫింగర్ 4 మన భూభాగంలోది. ఆ ప్రాంతాన్ని ప్రధాని చైనాకు ఎందుకు ఇచ్చారు? మన సైనికులు వీరోచితంగా పోరాడి కైలాశ్ పంక్తులను సొంతం చేసుకుంటే.. వారిని ఎందుకు వెనక్కి వచ్చేయమంటున్నారు? ఈ చర్య వల్ల భారత్‌కు లాభం ఏంటి? వ్యూహాత్మంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న దేప్సాంగ్ ప్రాంతం నుంచి చైనా బలగాలు ఎందుకు వెనక్కి వెళ్లటం లేదు? ప్రధాని భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చి.. వారి ముందు తలవంచారు."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
అదే ప్రధాని సమస్య
చైనాను ఎదుర్కోవటంలో ప్రధాని విఫలమయ్యారని దుయ్యబట్టారు రాహుల్. భారత భూభాగాన్ని సంరక్షించటం ప్రధాని బాధ్యతన్నారు. కానీ ప్రధానికి అదే సమస్యగా మారిందని.. అదేంటో తనకు అర్థం కావట్లేదన్నారు.
'దశల వారీగా బలగాలు వెనక్కి'
భారత్-చైనా మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్లో స్పష్టం చేశారు. పాంగ్యాంగ్ సరస్సు, ఈశాన్య లద్ధాఖ్‌లో ఉన్న ఇరు దేశాల బలగాలు దశల వారీగా వెనక్కు వచ్చేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. దాదాపు 9నెలలుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనకు తెరపడనుందని చెప్పారు.
ఇదీ చదవండి : నేటి నుంచి రైతన్నలతో రాహుల్ 'సమావేశాలు'