అసోం అసెంబ్లీ ఎన్నికల వేళ భాజపా వార్తా ప్రకటనలపై రాజకీయ దుమారం చెలరేగింది. పత్రికా ప్రకటనలను(అడ్వర్టైజ్మెంట్) భాజపా.. వార్తలుగా మభ్యపెట్టిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు అసోం సీఎం సర్బానంద సోనోవాల్ సహా.. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్రాధ్యక్షుడు రంజిత్ కుమార్ దాస్‌పై ఫిర్యాదు చేసింది.
''ఎన్నికల్లో గెలుపుపై భాజపాలో ఏకాభిప్రాయం లేదు. ఫలితాలను అంచనా వేయలేకే పత్రికా ప్రకటనల ద్వారా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి దశలో ఎన్నికలు జరిగిన 46 స్థానాలను గెలుచుకుంటామని చెప్పారు. పత్రికా ప్రకటనల్లో 47 అని మరో నేత తెలిపారు. తరువాత భాజపా రాష్ట్రాధ్యక్షుడు 42 అన్నారు. చివరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా 37 నియోజకవర్గాల్లో భాజపా విజయం సాధిస్తుందని ప్రకటించారు.''
-రిపున్ బోరా, కాంగ్రెస్ అధ్యక్షుడు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని భాజపా ఉల్లఘించిందని అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు రిపున్ బోరా ఆరోపించారు. ఎన్నికల ప్రకటనలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేస్తోందని మండిపడ్డారు.
ఈ అంశంపై ఎన్నికల ప్రధాన అధికారి నితిన్ ఖాడేకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. వార్తాసంస్థలు ఈ అంశంపై నిజానిజాలు అంచనా వేశాయా లేదా అని ప్రశ్నించింది.
ఇవీ చదవండి: అసోం తొలి దశ పోలింగ్ ప్రశాంతం