ఎండలు పూర్తిగా ముదరకున్నా దేశంలో రాజకీయ వేడి పెరిగింది! నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటమే ఇందుకు కారణం! తొలివిడతకు వారం రోజులు (27నే బెంగాల్, అసోంలలో) కూడా లేదు. ఆ తర్వాత వారం (ఏప్రిల్ 6న) తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలూ ఓటింగ్‌కెళుతున్నాయి. ఈ తరుణంలో ఏ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూస్తే....!
బంగాల్‌లో.. హిందూ ఓట్ల చుట్టూ
ఎన్నికల్లో మైనార్టీ ఓట్లకు గాలం వేయటం చూస్తుంటాం. కానీ ఈసారి బంగాల్ ఎన్నికల్లో మెజార్టీ హిందూ ఓట్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. 30% దాకా ఉన్న మైనార్టీల ఓట్లు తమవేనని ఇన్నాళ్లూ ధీమాగా ఉన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అధికారం నిలబెట్టుకోవాలంటే వాటినే నమ్ముకుంటే కుదరదని గుర్తించారు. దీంతో భాజపాతో పోటీగా తానూ హిందూ మంత్రం పఠిస్తున్నారు. అధికారంలోకి వస్తుందని కచ్చితంగా చెప్పలేకపోయినా బంగాల్‌లో తృణమూల్‌ను భాజపా బాగానే భయపెడుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవటం భాజపాకు లోపం. కష్టంగానే అయినా.. దీదీనే గట్టెక్కొచ్చనేది ప్రస్తుతానికి సర్వేల మాట! కానీ ఎనిమిది విడతల్లో ఏమైనా మారొచ్చు!
తృణమూల్ కాంగ్రెస్ స్వయంకృతాలు, అవినీతి ప్రభావం ఓటర్లపై పడితే కమల వికాసానికి దారులు పడ్డట్లే!
అసోంలో.. కమలానికి చెమటలు
అధికారంలోకి రావటానికి బంగాల్‌లో ఎంత ఉత్సాహంగా ఎదురుదాడి చేస్తున్నారో... అసోంలో అధికారం నిలబెట్టుకోవటానికి అంతగా చెమటోడుస్తున్నారు కమలనాథులు! సీఎం సోనోవాల్, సీనియర్ నేత హిమంత మధ్య విభేదాలు.. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు.. తేయాకు కార్మికుల్లో అసంతృప్తి భాజపాను భయపెడుతుంటే.. కాంగ్రెస్‌లో సమర్థ నాయకత్వం లేకపోవటం, కూటముల కుమ్ములాటలు ఊపిరినిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా అస్సాంపైనే దృష్టి పెడుతోంది. కాలం కలసివస్తే పార్టీతో పాటు తామూ తలెత్తుకోవచ్చని ప్రియాంక, రాహుల్ ప్రత్యేకదృష్టి పెడుతున్నారు. ప్రస్తుతానికి భాజపా మళ్లీ వస్తుందని కచ్చితంగా చెప్పలేని స్థితి!
తమతో జతకట్టిన ప్రాంతీయ పార్టీలు ఎలా రాణిస్తాయనేదానిపైనే భాజపా, కాంగ్రెస్‌ల భవిత ఆధారపడి ఉంటుంది.
కేరళలో.. కామ్రేడ్లకు కాసింత
దేశంలో కమ్యూనిస్టుల ఉనికి చాటుతున్న ఏకైక రాష్ట్రం కేరళ. దేశ రాజకీయ యవనికపై తమకున్న ఏకైక అధికార ముద్రను కోల్పోకుండా ఉండటానికి కామ్రేడ్లు తీవ్రంగా తపిస్తున్న రాష్ట్రం కూడా ఇదే! ఇప్పటిదాకా అధికార కూటమిని తదుపరి ఎన్నికల్లో విపక్షంలో కూర్చోబెడుతున్న కేరళ ఓటర్లు ఈసారి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారా అనేది ఆసక్తికరం! ఇక్కడ భాజపా సీట్లకంటే కూడా... ఓట్లెన్ని సంపాదిస్తుందనేదే చూడాలి. ఏప్రిల్ 6న ఒకేదశలో 140 స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఈసారి కూడా వామపక్ష కూటమికే మొగ్గుందనేది కొన్ని సర్వేల ఉవాచ!
కాంగ్రెస్ కుమ్ములాటలు ఎల్‌డీఎఫ్ కూటమికి మళ్లీ అవకాశమిచ్చేలా ఉన్నాయనేది విశ్లేషకుల మాట!
తమిళనాడులో..'అమ్మ' లేని వేళ
ద్రవిడ సిద్ధాంతాలు బలహీనపడి, జయలలిత, కరుణానిధి కనుమరుగైన పరిస్థితుల్లో వ్యక్తి ఆరాధన లేకుండా తొలిసారి ఎన్నికలకు వెళుతున్న తమిళనాట ఓ గుంభన స్థితి! అమ్మలేకున్నా ఆమె బొమ్మతో, సానుభూతితో, ప్రజాకర్షక హామీలతో, ఉచిత గాలాలతో నెట్టుకొస్తామని అధికార అన్నాడీఎంకే ధైర్యంగా ఉంటే... స్టాలిన్ నాయకత్వంలో తమకే అధికార పీఠం దక్కుతుందని డీఎంకే ధీమాగా ఉంది. సర్వేలైతే డీఎంకే వైపే మొగ్గు చూపుతున్నాయి. మరోవైపు పక్కనున్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భాజపా, అన్నాడీఎంకే కూటమికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గంపగుత్తగా ఒకరినే ఎంచుకునే తమిళ ఓటర్లు ఈసారి అలా చేస్తారా లేదా అనేది ఆసక్తికరం!
ఇవీ చూడండి: భాజపా దశాబ్దాల 'బంగాల్' కల నెరవేరేనా?