మహారాష్ట్రకు చెందిన ఓ చిన్నారి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అడిగిన ప్రశ్న ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భారత ప్రధానమంత్రి మోదీని.. 'మీరు ఎప్పుడు దేశానికి రాష్ట్రపతి అవుతారు' అని తన తేనెలొలికే మాటలతో అడిగింది. అది విన్న ప్రధాని, పక్కన ఉన్నవారు ఒక్కసారిగా బిగ్గరగా నవ్వారు. ఇలా ఒక్క ప్రశ్నతో ప్రధాని నోట నవ్వులు పూయించిన చిన్నారి ఎవరో కాదు. అహ్మద్‌నగర్ భాజపా ఎంపీ సుజయ్ విఖే పాటిల్ కుమార్తె.. అనీషా. మోదీతో కలిసి అనీషా దిగిన ఫొటోలు సామాజిక మాధ్యాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చిన్నారి ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది.
చిన్ననాటి నుంచే అభిమానం..
పదేళ్లు వయసు ఉన్న అనీషా పాటిల్‌కు చిన్ననాటి నుంచే ప్రధాని మోదీ అంటే చాలా అభిమానం. దీంతో ఆయనను చూడాలని కోరికను పెంచుకుంది. తండ్రి సుజయ్ దగ్గర పలు మార్లు తన అభిష్టాన్ని తెలుపగా అందుకు తండ్రి.. ప్రధానికి ఉన్న బిజీ షెడ్యూల్స్‌తో అపాయింట్మెంట్ దొరుకుతుందో.. లేదో అని చెప్పారు. దీంతో అనీషానే స్వయంగా ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ.. ఆయన కార్యాలయానికి ఈ మెయిల్ పెట్టింది. దీనిపై సానుకూలంగా స్పందించిన మోదీ.. అనీషాను తన ఛాంబర్‌కు ఆహ్వానించారు. కొంత సమయం పాటు తనతో ముచ్చటించారు. మోదీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. చివరగా అనీషా ఓ ప్రశ్న వేసింది. 'మీరు గుజరాత్ నుంచి వచ్చారు కదా.. మరి మీరు ఎప్పుడు రాష్ట్రపతి అవుతారు' అని అడిగింది. ఈ ప్రశ్నకు అవాక్కయిన మోదీ పకపక నవ్వారు.
మోదీతో సమావేశమైన తర్వాత అనీషాతో ఆమె కుటుంబ సభ్యులు ప్రధానిని సన్మానించారు. ఈ క్రమంలో దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇదీ చూడండి: '15కోట్ల మంది బాలలు, యువత చదువుకు దూరం'