West Bengal Restrictions: ఒమిక్రాన్ ధాటికి అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. తాజాగా ఈ జాబితాలోకి బంగాల్ చేరింది. రాష్ట్రంలో సోమవారం నుంచి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. రాత్రి 10- ఉదయం 5 గంటల మధ్య అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది.
కార్యాలయాలు కూడా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు 50 శాతం సిబ్బందితోనే పనిచేయాలని తెలిపింది. ముంబయి, దిల్లీకి విమానాల రాకపోకలపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వారానికి రెండో రోజులు మాత్రమే సేవలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. యూకే నుంచి వచ్చే విమానాలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. 50 శాతం సామర్థ్యంతో రాత్రి 7 గంటల వరకు లోకల్ ట్రెయిన్స్ రాకపోకలకు అనుమతించిన ప్రభుత్వం.. దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
స్కూల్స్ వాయిదా..
ప్రాథమిక పాఠశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఒడిశా ప్రభుత్వం. కరోనా వ్యాప్తి దృష్ట్యా 1 నుంచి 5వ తరగతి పిల్లలకు ఆన్లైన్లోనే పాఠాలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. కేసుల పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలను స్కూల్స్‌కు పంపడంపై చాలామంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసినట్లు విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ తెలిపారు.
ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం సోమవారం ప్రాథమిక పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది.
కేజ్రీవాల్ భరోసా
దిల్లీలో పెరుగుతున్న కొవిడ్ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో చాలా వరకు అంత తీవ్రత లేదని.. ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన అవసరం లేదని తెలిపారు.
"గతేడాది డిసెంబరు 29 నాటికి రెండు వేలుగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య శనివారానికి ఆరు వేలకు చేరుకుంది. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య తగ్గింది. 262గా ఉన్న ఆ సంఖ్య ప్రస్తుతం 247గా ఉంది. వెంటిలేటర్ మీద కూడా ప్రస్తుతం ఐదుగురు మాత్రమే చికిత్స పొందుతున్నారు."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
ఇదీ చూడండి : నిద్రమత్తులో డ్రైవర్.. నదిలోకి బస్సు.. ముగ్గురు దుర్మరణం