Palki ambulance: ఆరోగ్య పరంగా ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే... అటవీ ప్రాంతాల్లో నివసించే వారు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన రహదారి వసతి లేకపోవడం వల్ల వారు ఆస్పత్రికి చేరడం కష్టతరమవుతుంది. అంబులెన్సులు కూడా వారు ఉన్న చోటుకి త్వరగా చేరుకోలేవు. దాంతో ఎంతో మంది చికిత్స అందకుండానే ప్రాణాలను కోల్పోతుంటారు. ఇలాంటి విషాద ఘటనలను గమనించిన బంగాల్లోని అలిపుర్ద్వార్ జిల్లా అధికారులు వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. 'పాల్కి అంబులెన్సు' పేరుతో పల్లకీ తరహా అంబులెన్సును వారు ఏర్పాటు చేశారు.
Ambulance for remote areas: ఆలిపుర్ద్వార్ జిల్లాలోని బుక్సా డువర్స్ గ్రామంలో ఈ 'పాల్కీ అంబులెన్సు'ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. బుక్సా డువర్స్ గ్రామం దట్టమైన అడువుల మధ్య, ఎత్తైన కొండల మధ్య ఉంటుంది. దీంతో ఈ గ్రామస్థులు ఆస్పత్రికి చేరుకోవడానికి నానా అవస్థలు పడుతూ ఉండేవారు. అయితే.. ఇప్పుడు 'పాల్కీ అంబులెన్సు' ద్వారా రోగులను సులభంగా, వేగంగా సమీపంలోని ఆస్పత్రికి పల్లకిలో మోస్తూ తరలించగలమని అధికారులు చెబుతున్నారు.
"పాల్కీ అంబులెన్సు ఓ ప్రత్యేకమైన పద్ధతి. సాధారణ అంబులెన్సులో ఉండే సదుపాయాల్ని కొండప్రాంతాల్లో ఏర్పాటు చేయలేం. ఈ గ్రామం అత్యంత ఎత్తైన ప్రదేశం. అందుకే మేం ఈ పాల్కీ అంబులెన్సు ఆలోచనతో వచ్చాం. మేం ఇక్కడ శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాం. వారు సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు రోగులను తరలిస్తారు."
-సురేంద్ర కుమార్ మీనా, ఆలిపుర్ద్వారా జిల్లా కలెక్టర్
పాల్కీ అంబులెన్సులో ఆక్సిజన్, ఔషధాలు, సెలైన్ వంటివి ఉంటాయని సురేంద్ర కుమార్ మీనా తెలిపారు. ఆరోగ్య శాఖ సూచనలతో తాము ఈ అంబులెన్సు సౌకర్యాన్ని మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.
ఇదీ చూడండి: ఆర్మీ హెలికాప్టర్ క్రాష్‌కి ఒక్క నిమిషం ముందు వీడియో
ఇదీ చూడండి: 'వచ్చే ఏప్రిల్‌లో వస్తానని చెప్పి.. తిరిగి రాని లోకాలకు'