బంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్.. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు తమ ఓట్లను ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. కొన్ని చోట్ల ఈవీఎంలలో సమస్యలు తలెత్తగా వాటిని మార్చారు అధికారులు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తొలి విడతలో మొత్తం 30 స్థానాలకు పోలింగ్ నిర్వహించింది ఈసీ. ఇందుకోసం 10,288 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 191 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
పోలింగ్ శాతం...
ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు ప్రజలు. తొలి దశ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలు ఎక్కువగా ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. పురులియా, ఝార్గామ్ జిల్లాల్లోని అన్ని స్థానాలు.. బంకుర, మెదినీపుర్, పశ్చిమ మెదినీపుర్, పుర్బా జిల్లాల్లో కొన్ని స్థానాల్లో ఓటింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 79.79 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
భాజపా, టీఎంసీ మధ్య ఘర్షణలు..
పోలింగ్ సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. భాజపా, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తిన క్రమంలో భద్రత కట్టుదిట్టం చేశాయి బలగాలు. సువేందు అధికారి సోదరుడు సోమేందు అధికారి కారుపై కాంటాయ్ ప్రాంతంలో దాడి చేశారు దుండగులు. కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. టీఎంసీనే దాడికి పాల్పడినట్లు భాజపా నేతలు ఆరోపించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు కాషాయ నేతలు. అధికార పార్టీ రిగ్గుంగు పాల్పడిందని ఆరోపించారు.
పశ్చిమ మెదినీపుర్లో టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. భద్రతా సిబ్బంది వారిని చెదురగొట్టారు. పోలింగ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు తెల్లవారు జామున భగ్వాన్పుర్ నియోజకవర్గం సత్సత్మాల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు భద్రతా సిబ్బంది గాయప్డడారు. ప్రజలను భయపెట్టేందుకు టీఎంసీ ప్రయత్నించిందని భాజపా ఆరోపించింది.
ఓటు వేసిన ప్రముఖులు వీరే..