కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వారాంతాల్లో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల మధ్య ఆంక్షలు విధించనున్నారు.
వారాంతపు లాక్‌డౌన్‌తోపాటు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి కర్ఫ్యూ అమలు కానుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. మాల్స్, బార్లు, రెస్టారెంట్లను మూసి వేయనున్నారు. హోటళ్లలో పార్సిల్ సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితోనే పని చేయనున్నాయి.
అత్యవసర సేవలకు మాత్రమే..
వారాంతంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. 50 శాతం సామర్థ్యంతో ప్రజా రవాణా పని చేయనుంది. ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలను జారీ చేశారు. త్వరలోనే పూర్తిస్థాయి మార్గదర్శకాలను మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
వలసలు..
ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో వలస కూలీలు తమ గ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే అవకాశం ఉన్నందున సొంతూళ్లకు తరలివెళ్తున్నామని చెప్పారు.
జోధ్‌పుర్ ఐఐటీలో కలకలం..
రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ ఐఐటీలో కరోనా కలకలం రేపింది. 14 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్లు శనివారం వెల్లడైంది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. ఇప్పటివరకు మొత్తం 70 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
కొడగులో పర్యటకం రద్దు..
వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొడగులోకి పర్యటకుల రాకను నిషేధించింది కర్ణాటక ప్రభుత్వం. ఏప్రిల్ 20 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది.
జమ్ము కశ్మీర్‌లో పాఠశాలలు బంద్
కొద్ది రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. విద్యార్థుల, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రభుత్వం కూడా పాఠశాలలు మూసివేయాలనే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 5 నుంచి 18 వరకు పాఠశాలలు, ఒక వారం పాటు 10 నుంచి 12 భౌతిక తరగతులు నిలిపేస్తున్నట్లు ఆదివారం ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
ఇదీ చదవండి : 'మోదీ దేవుడా? మానవాతీత శక్తా?'