నివర్ తుపాను నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తమిళనాడుకు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. తర్వాత తుపానుగా మారే అవకాశముంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఓ ప్రకటన చేసింది. ఈ తుపాను బుధవారం శ్రీలంక తీర ప్రాంతాన్ని దాటవచ్చని అంచనా వేసింది. ఈ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఈ మేరకు దక్షిణ తమిళనాడు, కేరళ ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు జారీచేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. ఈ సందర్భంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఇవాళ్టి నుంచి జాలర్లు బంగాళాఖాతంలోని ఆగ్నేయ, నైరుతి ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లినవారు తీరానికి తిరిగి రావాలని కోరారు.
డిసెంబర్ 2 నుంచి 3 మధ్య భారీ వర్షాలు కురవనున్నాయన్న ప్రకటన నేపథ్యంలో కేరళలోని నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్డ్ జారీ అయింది. తిరువనంతపురం, కొల్లం, పథానంతిట్ట, అలప్పుజ జిల్లాలకు ఈ మేరకు హెచ్చరికలు జారీ కాగా.. ఇడుక్కి, ఎర్నాకులం, కొట్టాయం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ అయింది. ఈ ప్రభావంతో వచ్చే 24 గంటల్లో 20 సెం.మీ.లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.