Supreme Court: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో 30 ఏళ్లకుపైగా జైలుశిక్ష అనుభవించిన ఎ.జి.పెరారివలన్‌ను విడుదలచేసే విషయమై సుప్రీంకోర్టులో బుధవారం వాడిగా వాదనలు సాగాయి. క్షమాభిక్షకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయానికి కట్టుబడి ఉన్న ఆ రాష్ట్ర గవర్నర్.. అందుకు సంబంధించిన దస్త్రాన్ని రాష్ట్రపతికి సిఫారసు చేయడాన్ని ఆక్షేపించింది. రాజ్యాంగ విరుద్ధంగా జరిగే ప్రక్రియను తాము చూస్తూ ఊరుకోబోమని వ్యాఖ్యానించింది. సంబంధిత వ్యాజ్యాలపై జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్.గవాయ్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
కేంద్రం తరఫున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ వాదనలు వినిపిస్తూ.. పెరారివలన్ క్షమాభిక్ష దస్త్రాన్ని గవర్నర్ రాష్ట్రపతికి సిఫారసు చేశారని, ఇది ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చిందన్నారు. రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేవరకూ నిరీక్షించాలని ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. వచ్చేవారం నాటికి స్పందన తెలియజేయాలని కేంద్రానికి విస్పష్టం చేసింది. "క్షమాభిక్ష ఫైలును రాష్ట్రపతికి సిఫారసు చేస్తూ గతేడాది జనవరి 27న గవర్నర్ నిర్ణయించారు. ఈ ఫైలు ఇటీవలే కేంద్రం వద్దకు వచ్చిందని చెబుతున్నారు. పెరారివలన్ 30 ఏళ్లకుపైగా జైల్లో శిక్ష అనుభవించాడు. 20 ఏళ్ల శిక్ష పూర్తిచేసిన వారిని విడుదల చేయాలని గతంలో ఎన్నో తీర్పులు ఉన్నాయి. అలాంటప్పుడు పెరారివలన్ విషయంలో వివక్ష చూపడం సరికాదు. జైల్లో ఉంటూ అతను ఉన్నత విద్యను అభ్యసించాడు. పలు డిగ్రీలు సాధించాడు. అతని ప్రవర్తన బాగుంది. జైలు జీవితం కారణంగా పలు వ్యాధులకు గురయ్యాడు. ఈ విషయాలన్నీ మీరు పరిగణనలోకి తీసుకుని, వాదనలు వినిపించేందుకు సిద్ధంగా లేకపోతే.. అతడి విడుదలకు ఆదేశాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్ తన అధికారాలను వినియోగించకుండా.. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాన్ని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చా? లేదా? అనేది పరిశీలించాల్సి ఉంది" అని ధర్మాసనం స్పష్టం చేసింది. పెరారివలన్‌కు న్యాయస్థానం గతనెల 9న బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చూడండి: రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడికి బెయిల్