నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న దీక్ష 100వ రోజుకు చేరింది. గతేడాది నవంబర్ 26న ఉద్యమాన్ని ప్రారంభించిన రైతు సంఘాలు దిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రి, ఘాజిపూర్ వద్ద ఆందోళన చేస్తున్నాయి. ఆందోళనల సందర్భంగా రైతులు రహదారుల దిగ్బంధనం, బహిరంగ సభలు సహా పలు రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవంరోజు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో కొందరు ఎర్రకోటపై దాడి చేశారు. ఆ ఘటనలో కొందరు నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. ఆందోళన కొనసాగిస్తూనే... కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాలు పలు దఫాలు చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు.
ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసే వరకు ఏడాదైనా ఆందోళనను కొనసాగిస్తామని రైతు సంఘాలు తెలిపాయి. ఆందోళనలకు 100 రోజులైన నేపథ్యంలో ఇవాళ బ్లాక్ డే పాటిస్తున్నారు. 5 గంటల పాటు దిల్లీలోని కుండ్లీ మనేసర్ పల్‌వాల్ ఎక్స్‌ప్రెస్ హైవేను దిగ్బంధిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను భారీగా పెంచారు
"ప్రభుత్వం మా డిమాండ్లను తీర్చేవరకు మేము ఈ ప్రాంతం నుంచి కదిలేది లేదు. ఈ విషయంపై మేము అందరం దృఢ నిశ్చయంతో ఉన్నాము."
-రాకేశ్ టికాయిత్, భారత్ కిసాన్ యూనియన్
"ఈ ఉద్యమం రైతులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చింది. రైతులను నిర్లక్ష్యం చేయకూడదని రాజకీయ నాయకులు తెలుసుకున్నారు. నిరసకారులలో చీలిక తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు."
-యోగేంద్ర యాదవ్, స్వరాజ్ ఇండియా
మహిళలదే నిర్వహణ
ఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా రైతు సంఘాల నేతలు నిరసనలు చేపట్టే బాధ్యతను మహిళలకు అప్పగించనున్నారు. ఆ రోజు రైతు సంఘాల ప్రతినిధులుగా కూడా మహిళలే వ్యవహరిస్తారు.
ఇదీ చదవండి : ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల జైలు శిక్ష