ఉత్తరాఖండ్ మహా ప్రళయానికి సంబంధించిన సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ధౌలి గంగ నీటి మట్టం అనూహ్యంగా పెరగడమే ఇందుకు కారణం. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలను నిలిపివేశారు. తపోవన్ విద్యుత్ ప్రాజెక్టు సొరంగాల్లో చిక్కుకున్న 30-35మందిని గుర్తించే పనులు కూడా ఆగిపోయాయి. సోమవారం ఉదయం సహాయక చర్యలను తిరిగి పునరుద్ధరించారు.
దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఆదివారం జల విలయం బీభత్సం సృష్టించింది. జోషిమఠ్ వద్ద నందాదేవీ హిమానీనదం కట్టలు తెంచుకోవడం వల్ల చమోలీ జిల్లా రేనీ తపోవన్ వద్ద రిషి గంగా నదికి ఆకస్మిక వరదలు సంభవించాయి. రెండు జల విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 170మంది గల్లంతయ్యారు. 16మందిని సహాయక సిబ్బంది కాపాడింది.
ఇదీ చూడండి:- జలప్రళయం మిగిల్చిన విధ్వంస చిత్రమిది...
దిల్లీ నుంచి నిపుణులు..
ప్రభావిత ప్రాంతాల్లో.. సోమవారం ఉదయం 6:45గంటల సమయంలో శాస్త్రవేత్తలు, నిపుణులు పర్యటిస్తారని భారత వాయుసేన వెల్లడించింది. వీరిని దిల్లీ నుంచి ప్రత్యేకంగా పిలిపించినట్టు పేర్కొంది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగేందుకు సహకరిస్తామని స్పష్టం చేసింది.
ప్రధాని ఫోన్..
పూర్తి వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో నాలుగుసార్లు ఫోన్లో సంభాషించినట్టు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ వెల్లడించారు. రాష్ట్రంలోని వరద పరిస్థితులను మోదీ సమీక్షించినట్టు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- కరుగుతోన్న హిమనీనదాలు- పొంచి ఉన్న ప్రళయాలు